నెల రోజుల్లో పనులు పూర్తి కావాల్సిందే..


Ens Balu
2
Srikakulam
2021-07-20 16:47:58

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బికేలు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణం రానున్న నెల రోజుల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం ధర్మాన  కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు. గడువు తర్వాత ఏ ఒక్క కేంద్రం కూడా అసంపూర్తిగా కనిపించరాదని స్పష్టం చేశారు. సారవకోట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా అధికారులతో కలిసి మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారనడానికి వారి పనితీరే కొలమానమని పేర్కొన్నారు. ఇండ్ల పట్టాల పంపిణీకి సంబంధించి అడ్డంకులు తొలగించాలని,  ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలు తొలగించి ఆయా ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఆ భూములను కేటాయించాలనీ ఆదేశాలు ఇచ్చారు. చాలా చోట్ల ఏజెన్సీలనే ఏర్పాటు చేయలేదని తన దృష్టికి వచ్చిందని,  వెంటనే వాటిని ఏర్పాటు చేసి అన్ని పనులూ మొదలు పెట్టాలన్నారు. పనులన్నీ అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించాలని సూచించారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయనున్నారని ఆ సమయానికి నూరు శాతం సన్నద్ధతతో అన్ని నిర్మాణాలను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తాను త్వరలోనే క్షేత్రస్థాయిలో ఈ నిర్మాణాలను పరిశీలిస్తానని, మార్పు లేని చోట సంబంధిత అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తానని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాముల నాయుడు వివిధ శాఖల ప్రగతిపై అధికారులతో కలిసి వివరించారు. ఎన్ఆర్జిఎస్ పనులు, సాగునీటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో  డిఆర్డీఏ పీడీ బి.శాంతి శ్రీ, పాలకొండ ఆర్డీవో కుమార్, వంశధార ఎస్ ఈ డోల తిరుమల రావు, నీటిపారుదల శాఖ ఎస్ఈ పి.సుధాకర్, పీఆర్ ఎస్ఈ బ్రహ్మయ్య, మండల ప్రత్యేక అధికారి జై రాజు, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు, తాసిల్డార్ రాజమోహన్ రావు, ఎంపీడీవో ఈశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.