అభివ్రద్ధి పధంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..


Ens Balu
4
Paralakhemundi
2021-07-20 16:57:25

రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. పూండి - పర్లాఖిమిడి రాష్ట్ర హైవే విస్తరణ కార్యక్రమాన్ని పూండి రైల్వే గేట్ వద్ద మంత్రి మంగళ వారం శంఖుస్థాపన చేశారు. రహదారి విస్తరణ కార్యక్రమాన్ని రూ.25 కోట్లతో రహదారులు, భవనాల శాఖ చేపడుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నువ్వలరేవు నుండి టెక్కలి పట్నం వరకు రహదారి విస్తరణ జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని తెలిపారు. అనేక పంచాయతీలు భవనాలు లేక ఉన్నాయని అటువంటి సమయంలో ప్రతి సచివాలయానికి కోటి రూపాయలతో భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి మంజూరు చేసారని ఆయన తెలిపారు. ప్రజల ఫిర్యాదులు స్థానికంగా పరిష్కారానికి కృషి చేయడం అభివృద్ధిలో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవ అభివృద్ధి అంటే ఏమిటో ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని ఆయన పేర్కొన్నారు. నాడు నేడు పనులు చేపట్టి పాఠశాలల రూపురేఖలు మార్చడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రామాణిక విద్య జీవితాన్ని మార్చుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారని మంత్రి వివరించారు.రిమ్స్ వైద్య కళాశాల, టెక్కలి జిల్లా ఆసుపత్రి, హరిపురం, పలాస సామాజిక ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్రం ఇచ్చామని ఇది అభివృద్ధిలో భాసగమని అన్నారు. 

మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రూ.30 కోట్లతో అక్కుపల్లి రోడ్డు పనులు జరుగుతున్నాయని, మందస మండలంలో మారుమూల ప్రాంతమైన తురసవాడకు కూడా రహదారులు వేశామని మంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రూ.36 కోట్లతో రోడ్లు వేశామని ఆయన చెప్పారు. కాశీబుగ్గ ఫ్లై ఓవర్ పనులు మొదలు పెట్టామని, పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. రహదారి విస్తరణకు సహకారాన్ని అందిస్తున్న వ్యాపారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నౌపడ వెంకటాపురం రోడ్డుకు త్వరలో శంఖుస్థాపన చేస్తామని, జీడీపిక్కల మద్ధతు ధర సమస్య  పరిష్కరించుటకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. తితిలి సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.

        జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ పూండి - పర్లాఖిమిడి రహదారి విస్తరణ వలన ఈ ప్రాంతం అభివృద్ధి పథకంలోకి వెళుతుందన్నారు. గ్రామాల్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం తదితర భవనాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. సంవత్సరం కాలంలో గ్రామాల రూపు రేఖలు మారతాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పారిశ్రామిక, పర్యాటక, మౌళిక సదుపాయాలు గల జిల్లా గా అభివృద్ధి చెందాలని అన్నారు. వెనుకబడిన జిల్లాగా ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. మూడవ దశ వ్యాప్తిలో ఉందని గుర్తించాలని, అందరూ మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.  ఆర్ అండ్ బి ఎస్.ఇ కె.కాంతిమతి మాట్లాడుతూ  పూండి - పర్లాఖిమిడి రహదారి రాష్ట్ర హైవే గా ఉందన్నారు. ఆఫ్ షోర్ లో రెండు కిలోమీటర్ల మేర ఉండటంతో జలవనరుల శాఖ సమన్వయంతో చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ ఛైర్మన్ బల్లా గిరిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సతీష్, దువ్వాడ రాంబాబు, సర్పంచులు, అధికారులు, అనాధికారులు పాల్గొన్నారు.