కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని, అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. థర్డ్‌వేవ్ సన్నద్దతలో భాగంగా పలు ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో, కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, థర్డ్‌వేవ్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నామని, ఒకవేళ వచ్చిన పక్షంలో, ఎదుర్కొనడానికి అన్నివిధాలా సిద్దంగా ఉండాలని అన్నారు. మొదటి, రెండో దశలో కోవిడ్‌ను ఎదుర్కొనడంలో ప్రయివేటు ఆసుపత్రులు సమర్థవంతంగా పనిచేశాయని అభినందించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, థర్డ్‌వేవ్ కోసం ఆసుపత్రుల్లో తగిన వసతులను సమకూర్చుకొని సిద్దం చేయాలని కోరారు. ఆసుపత్రిలోని పడకలన్నిటికీ ఆక్సీజన్ సదుపాయాన్ని కల్పించాలని, ఆక్సీజన్ సిలండర్లను, కాన్‌సెంటేటర్లును అవసరమైనన్ని సమకూర్చుకోవాలని, ఆక్సీజన్ ట్యాంకులను, ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వెంటిలేటర్ బెడ్స్ సంఖ్యను ప్రతీ ఆసుపత్రిలో పెంచాలని స్పష్టం చేశారు. వసతులతోపాటుగా తగిన మానవ వనరులను, నైపుణ్యం గల సిబ్బందిని సిద్దం చేయాలని అన్నారు. అధికారులు ప్రయివేటు ఆసుపత్రులను తనిఖీ చేసి, థర్డ్‌వేవ్‌కు సిద్దం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్(సంక్షేమం) జె.వెంకటరావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఐపిఓ కళింగవర్థన్, ఇతర అధికారులు, ప్రయివేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.