నవరత్నాలు లో భాగంగా, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, జిల్లాలో శతశాతం ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలని ఆదేశించారు. వెంటనే లబ్దిదారులందరినీ చైతన్యపరిచి, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభింపజేయాలని సూచించారు. గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిష్ట్రేషన్, జాబ్‌కార్డు జారీ తదితర ప్రక్రియలపై తన ఛాంబర్‌లోమంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ హరి జవహర్ లాల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రౌండింగ్‌లో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జాబితాల్లో ఎవరైనా అనర్హులుంటే, వారి పేర్లు తొలగించాలని, అర్హులందరిచేతా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభింపజేయాలని చెప్పారు. ఇంకా ఎక్కడైనా లేఅవుట్లకోసం భూమిని సేకరించాల్సి ఉంటే, తక్షణమే ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. లేఅవుట్లలో సిసి రోడ్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి పాల్గొన్నారు.