నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతి సర్పంచులకు ప్రాధమిక శిక్షణా కార్యక్రమం ఈ నెల 22 నుండి పార్వతీపురం డివిజన్ లో గల 15 మండలాల సర్పంచ్లకు, 4 బ్యాచ్ లకు, ఒక్కో బ్యాచ్ కు 3 రోజులు చొప్పున నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన అధికారులతో ఉద్యాన కళాశాలలో మంగళవారం పార్వతీపురం సబ్ కలెక్టర్ భావనా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 100 నుండి 120 మందితో బ్యాచ్ లను ఏర్పాటు చేయడమైందని, ఒక్కో బ్యాచ్ కు మూడేసి రోజుల చొప్పున శిక్షణా కార్యక్రమం ఉంటుందని అన్నారు. పార్వతీపురం డివిజన్ వారికి గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర లో ఉన్న ఉద్యాన కళాశాలలో 379 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సంబంధిత ఏర్పాట్ల పై సమీక్షించారు, శిక్షణకు అవసరమగు సామగ్రిని, టేబుళ్ళ ను, హాజరు పట్టికలను, ఐ.డి కార్డులను సిద్ధంగా ఉంచుకోవలన్నారు. సర్పంచులందరినీ ఒకేలా చూడాలని, క్రమ శిక్షణ తో శిక్షణ జరిగేలా చూడాలని సూచించారు. చక్కటి భోజన, వసతి, బెడ్స్ , అల్పాహారం, త్రాగు నీరు ఏర్పాటు చేయాలని, వారి రవాణా కు కూడా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. స్థానికంగా ఎక్ష్పొజర్ పర్యటనకు ఏర్పాటు చేయాలనీ ఇందులో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటేలా చూడాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, చెరువు శుద్ధి, అలంకరణ తదితర అంశాల పై అవగాహన కలిగేల ఏర్పాటు చేయాలన్నారు. ముందు గానే ఆయా శాఖలకు సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలన్నారు. శిక్షణ లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉండాలన్నారు. శిక్షణ అనంతరం ఇచ్చే సర్టిఫికేట్ లు, ఫోటో లు ప్రతి ఒక్కరికి అందజేయాలన్నారు. శిక్షణ లో ప్రధానంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత, పంచాయతీల విధులు, అధికారాలు, బాధ్యతలు, లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పన లో గ్రామాభి వృద్ధి తాగు నీరు, రోడ్లు, విద్యుత్ దీపాలు, పంచాయతీల ఆర్ధిక పరిపుష్టి, ఆర్ధిక వ్యవహారాలు, సంక్షేమ పధకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం తదితర అంశాల పై శిక్షణ ఉంటుందన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలని అన్నారు.
కోవిడ్ నిబంధనలు తప్పనిసరి
శిక్షణకు హాజరయ్యే సర్పంచులందరికి ధర్మల్ స్కానర్ తో పరీక్షించాలని, శిక్షణలో భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, ప్రవేశం వద్ద శానిటైజర్ ఉంచాలని, కోవిడ్ నిబంధనలను పాటించడమే కాకుండా, శిక్షణ లో కోవిడ్ పై కూడా తరగతి నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకటేశ్వర రావు, డి.ఎల్.డి.ఓ రాజ్ కుమార్, డి.డి. ట్రైబల్ వెల్ఫేర్ కిరణ్, కొమరాడ, గరుగుబిల్లీ, తెర్లాం, మక్కువ ఎం.పి.డి.ఓ లు, గరుగుబిల్లీ, పార్వతీపురం తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.