సమగ్ర భూ సర్వే ద్వారా మరింత ఖచ్చితమైన భూముల రికార్డులు తయారవుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. రీసర్వే ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని కోరారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై తన ఛాంబర్‌లో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ ప్రక్రియ ద్వారా నాణ్యమైన, ఖచ్చితమైన రికార్డులు రూపొందుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, కాలవ్యవధిని పెట్టుకొని త్వరగా సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఆరు అంచెలుగా భూముల రీసర్వే ప్రక్రియ జోరుగా జరుగుతోందన్నారు. ఇతర జిల్లాలకంటే మన జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా తొలుత డివిజన్‌కు ఒక గ్రామాన్ని, ఆ తరువాత మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ద్రోణ్ ద్వారా సర్వే ప్రక్రియ చేపట్టామన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 72 గ్రామాల్లో సర్వేను పూర్తి చేయడం జరిగిందన్నారు. తాజాగా మూడునాలుగు మండలాలు కలిపి ఒక క్లష్టర్‌గా నిర్ణయించి, క్లష్టర్ల వారీగా సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేసి, ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించడం జరిగిందని జెసి వివరించారు.
ఈ సమావేశంలో సర్వే, భూ రికార్డులశాఖ సహాయ సంచాలకులు కె.రాజాకుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.