బ్యాంకు గ్యారెంటీలు ఇప్పించండి..
Ens Balu
2
Vizianagaram
2021-07-20 17:41:21
తాము చెల్లించిన బ్యాంకు గ్యారెంటీలను తిరిగి ఇప్పించాలని, జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్‌కు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. జాయింట్ కలెక్టర్ కిశోర్‌ను మంగళవారం ఆయన ఛాంబర్‌లో, అసోసియేషన్ ప్రతినిధులు కలిసి, తమ బాధలు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల మేరకు జిల్లాలో ధాన్యం సేకరణ జరిగిందని, సిఎంఆర్‌ను కూడా దాదాపు అందజేయడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు కొండపల్లి కొండలరావు అన్నారు. ఇంకా కేవలం 5,100 టన్నుల సిఎంఆర్ మాత్రమే పెండింగ్ ఉందని, దానిని కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే అధిక శాతం మిల్లర్లు, చాలా రోజుల క్రితమే సిఎంఆర్‌ను పూర్తిచేశారని, అయినప్పటికీ వారికి నేటివరకూ బ్యాంకు గ్యారెంటీలు తిరిగి ఇవ్వలేదని అన్నారు. బిజిలు రాకపోవడం వల్ల, మిల్లర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలోని మిల్లర్లు వివిధ కారణాలరీత్యా, ఆర్థికంగా చితికిపోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బిజిలు ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిలర్లు ఎదుర్కొంటున్న పలు ఇతర సమస్యలను వివరించారు. దీనిపై జెసి కిశోర్ స్పందిస్తూ, వారి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, బిజిలను ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.