వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి క్లైమ్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా&సంక్షేమం) జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడలో జేసీ జి. రాజకుమారి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి, వైయస్సార్ బీమా క్లయిమ్స్ లాగిన్ వివరాలు,ఆన్ లైన్ లో అప్లోడ్ ,పోర్టల్ రిపోర్టులను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ కారణాల చేత మరణించిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వైయస్సార్ బీమా పథకానికి సంబంధించిన లబ్ది వెంటనే కుటుంబానికి అందించడం ద్వారా మరణించిన వారి కుటుంబంలో మనోధైర్యాన్ని నింపవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో వైయస్సార్ బీమా చాలా ప్రధానమైనదని ఆమె తెలిపారు. దుఃఖంలో ఉన్న వారిని స్వయంగా వెళ్లి కలుసుకోకపోయినా వారికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాన్ని ఆదుకోవచ్చన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ బీమా పథకం పై ప్రత్యేక దృష్టి పెట్టినందున అధికారులు మరింత శ్రద్ధ కనబరిచి బీమా క్లయిమ్స్ ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 లక్షల 63వేల 303 మందిని వైయస్సార్ బీమా లో ఎన్ రోల్ చేయడంతో ఇప్పటివరకు సుమారు 99.65శాతం సర్వే పూర్తయిందని ఆమె తెలిపారు. జూలై 1 నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ. పది వేలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో జూలై 1 నుంచి నేటి వరకు మొత్తం 218 మరణాలు రిజిస్టర్ కాగా 207 సహజ మరణాలు, 11 ప్రమాద మరణాలుగా నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలే లబ్ధిదారులుగా ఉన్నందున జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పాత్ర చాలా కీలకమైనదని గుర్తించి అధికారులు జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సమన్వయంతో పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని జేసీ రాజకుమారి అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో జేసీ రాజకుమారి వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వై.హరిహరనాథ్ , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డీఎస్. సునీత, బీసీ సంక్షేమ అధికారి కె. మయూరి, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసు,.. సోమేశ్వర రావు, ఏరియా కో-ఆర్డినేటర్ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.