గిరిప్రదక్షిణ రద్దు..దర్శనాలుంటాయ్


Ens Balu
3
Simhachalam
2021-07-21 16:37:12

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ప్యూ పొడిగింపు, కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)వారి గిరి ప్రదక్షిణ రద్దుచేస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఈఓ మీడియాతో మాట్లాడుతూ, కర్ఫ్యూ నేపథ్యంలో గిరిప్రదక్షిణ రద్దు చేశామన్నారు. సింహగిరిపైన కూడా ప్రదక్షిణలకు అనుమతిలేదని తెలిపారు. కాగా ఈ నెల 23, 24వ తేదీల్లో స్వామివారి దర్శనాలు మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపనున్నామని చెప్పారు. 23వ తేదీన శ్రీస్వామివారి మాస జయంతి, 24వ తేదీనే తుదివిడత చందన సమర్పణ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆరోజు దర్శనాల కోసం  22 ఉదయం నుంచి రెండు రోజులపాటు అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇందులో వంద, మూడు వందల రూపాయల టికెట్లు కౌంటర్లలో అడ్వాన్స్ గా  అమ్ముతున్నామన్నారు. అలాగే 300 రూపాయల టికెట్లు 2,500, వంద రూపాయల టికెట్లు 2,500 అందుబాటులో ఉంచామన్నారు.  అత్యంత పవిత్రమైన 24వ తేదీకోసం  మొత్తం 5వేల టికెట్లు అడ్వాన్స్ గా అమ్మాలని నిర్ణయించినట్టు చెప్పారు.  వీఐపీలకు కూడా లఘు దర్శనాలు మాత్రమే ఉంటాయని, వేద ఆశీర్వాదాలుండవని వివరించారు. ఉదయం6గంటల నుంచి మధ్యాహ్నం3 గంటల వరకూ విరామం లేకుండా దర్శనాలు జరిపిస్తామన్నారు. 8 లడ్డూ కౌంటర్ల ద్వారా లక్ష లడ్డూ ప్రసాదం కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తెల్లవారు జామున 3 గంటలకే సింహాచలం కొండపైకి బస్సులు నడపడంతోపాటు, టికెట్ల కౌంటర్లు, కేశ ఖండనశాల కూడా 3 గంటలకే తెరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు డా. టీపీ రాజగోపాల్, ప్రధానార్చకులు గోపాల కృష్ణమాచార్య, హవల్దార్ ఈఈలు, ఏఈఓలందరూ పాల్గొన్నారు.