కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో 2 ఏళ్లలో రూ.66 కోట్లుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం కాకినాడ గ్రామీణం కొత్త గైగోలుపాడు 49వ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి మంత్రి కురసాల కన్నబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాకినాడ గ్రామీణ నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి అమలు చేయడం జరిగిందన్నారు. గడిచిన రెండేళ్లలో కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో స్మార్ట్ సిటీ, జనరల్ ఫండ్స్, 14 ,15- ఆర్థిక సంఘం నిధుల నుంచి సుమారుగా 66 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. కాకినాడకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడంలో నగరపాలక సంస్థ కమిషనర్,ఇతర అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే కాకినాడకు పెన్షనర్ ప్యారడైజ్ గా మంచి గుర్తింపు ఉందని అదేవిధంగా ఉత్తమ నివాసయోగ్యమైన పట్టణముగా కాకినాడకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.
కాకినాడ నగరపాలక సంస్థలో అంతర్భాగంగా ఉన్న 49 వ వార్డులో సుమారుగా రూ.80 లక్షల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందని, నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. సీసీ డ్రైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు విద్యుత్ సమస్యలు తొలగించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. చెత్తను ప్రాసెస్ చేసి తిరిగి వినియోగించే విధంగా గార్బేజ్ ట్రాన్సఫర్ సెంటర్ ను సుమారుగా రూ.ఏడు కోట్ల రూపాయలతో కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తయిందన్నారు. రాబోయే రెండు,మూడు సంవత్సరాల్లో కాకినాడ స్థాయిని మరింత పెంచే విధంగా ప్రజా ప్రతినిధులు ,అధికారులు సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓపెన్ సైట్స్ కి సంబంధించి ఆక్రమణలు చేసే వారిపై నగరపాలక సంస్థ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు.
అనంతరం కొత్త గైగొలుపాడు 49వ వార్డులో ఉన్న శ్మశానశాన వాటిక, రోడ్డును స్మార్ట్ సిటీలో భాగంగా ఆధునీకరించేందుకు సంబంధించి కమీషనర్ , ఇతర ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి కన్నబాబు చర్చించారు. అదేవిధంగా 49 వ వార్డులో సమారుగా రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న పీ.హెచ్.సి భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, తడి- పొడి చెత్తను వేరు చేయడం, స్మార్ట్ సిటీ అభివృద్ధికి స్థానిక ప్రజల భాగస్వామ్యం నూరు శాతం ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి కాకినాడను జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణరాజు ,డీఈలు ,ఏఈలు ఇతర ఇంజనీరింగ్ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.