3వ దశకు ముందస్తు ఏర్పాటు చేయండి..


Ens Balu
3
కాకినాడ
2021-07-22 13:57:52

తూర్పుగోదావరి జిల్లాలో 3వదశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ మూడో దశ సన్నద్ధతపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నోడల్ అధికారులు‌, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి లతో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో దశ కోవిడ్ ముప్పు పొంచి యున్నందున ఆసుపత్రిలో సాధారణ ,ఆక్సిజన్, ఐసియు పడకలను, వెంటిలేటర్స్, ఆక్సిజన్ సిలిండర్ ఇతర  మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు .నియోనటల్ పడకలు కూడా తగినన్ని అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రతి ఆస్పత్రికి నోడల్ అధికారులు నిరయమించడం జరిగిందని , నోడల్ అధికారులు క్రమం తప్పకుండా ఆసుపత్రులను తనిఖీ చేయాలి అన్నారు. కోవిడ్ మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సరైన  కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.కేవిఎస్ గౌరీశ్వరరావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.పీ రాధాకృష్ణ,జేడ్పీసీఇవో ఎన్ వివి.సత్యనారాయణ, ఏపీఎంఐసి ఇంజనీర్లు,ఇతర అధికారులు హాజరయ్యారు.