భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
Ens Balu
2
Vizianagaram
2021-07-22 15:33:07
కోస్తా ప్రాంతంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టాలు చోటుచేసుకోకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలన్నారు. ఒకవేళ ఎక్కడైనా కమ్యూనికేషన్ దెబ్బతింటే, వెంటనే పునరుద్దరించేందుకు ముందస్తు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రోడ్లు ఎక్కడైనా కొట్టుకుపోయే పక్షంలో, వాటిని హుటాహుటిన పునర్‌నిర్మించేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ఎక్కడైనా చెరువులకు గండ్లు పడే అవకాశం ఉన్నందున, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ముందుగానే తనిఖీ చేయాలని సూచించారు. విద్యుత్ స్థంబాలు పడిపోవడం, విద్యుత్ వైర్లు తెగిపోవడం చోటుచేసుకొనే అవకాశం ఉందని, అందువల్ల విద్యుత్ అధికారులు ముందుగా తమ శాఖాపరంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పెద్దపెద్ద చెట్లు, పాత వృక్షాలు కూలిపోయే ప్రమాదం ఉందని, వాటిని తొలగించేందుకు పవర్ సాలను, ఇతర పనిముట్లను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలించేందుకుగాను, పునరావాస కేంద్రాలను ముందుగా గుర్తించి సిద్దం చేయాలని సూచించారు. వారికి అవసరమైన ఆహారం, ఇతర అవసరాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. త్రాగునీటి పథకాలు దెబ్బతినే అవకాశం ఉందని, వాటిని హుటాహుటిన పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి ప్రమాదం చోటుచేసుకున్నా, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలని, తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్, విద్యుత్, త్రాగునీటి సరఫరా అధికారులను, ఇతర సాంకేతిక నిపుణులను ముందుగానే అప్రమత్తం చేయాలని, కంట్రోలు రూములను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, సబ్ కలెక్టర్ భావన, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, వివిధ మండలాల తాశీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.