నిరుపేదలకు బలవర్ధకమైన పౌష్టికాహారం అందించే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) 2013 ను అమలు చేస్తుందని పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారి డా. ఉపేంద్ర సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ హాలులో నోడల్ అధికారి జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా,రెవెన్యూ) ఎఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డితో కలిసి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఆహార భద్రత చట్టం ద్వారా ఉచితంగా ప్రతి నెల అందించే 5 కేజీల బియ్యం వారికి ఎంతో విలువైనదన్నారు. ఉచిత బియ్యం నిరుపేదలకు సక్రమంగా అందకపోతే దేశంలో కార్మికుల శ్రమశక్తి పైన తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ 2013 పటిష్టంగా అమలుకు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమీటీల పాత్ర ఎంతో కీలకం అన్నారు. ఆహార భద్రత చట్టం అమలులో వచ్చే సమస్యలను విజిలెన్స్ మానిటరింగ్ కమీటీల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎన్ఎఫ్ఎస్ఏ 2013 అమలు తీరును పరిశీలన చేసి ఫీడ్ బ్యాక్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జయపూర్లోని కమ్యూనికేషన్ మరియు స్టడీస్ డెవలప్మెంట్ సెంటరుకు బాధ్యతలు అప్పగించిందన్నారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ బృందం గుంటూరు జిల్లాలో శుక్రవారం, శనివారం, ఆదివారం ఎన్ఎఫ్ఎస్ఏ 2013 అమలును క్షేత్రస్థాయిలో రేషన్ షాపుల వద్ద పరిశీలిస్తుందని, రేషన్ కార్డు లబ్ధిదారులతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందన్నారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం జిల్లాలో ఆహర భద్రత చట్టం అమలు సంతృప్తికరంగా ఉందని, క్షేత్ర స్థాయిలో పర్యటించి మరోసారి ఫీడ్ బ్యాక్ అందిస్తామన్నారు.
సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ జిల్లాలో ఎన్ఎఫ్ఎస్ఏ 2013 అమలు గురించి పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారికి వివరిస్తూ రాష్ట్రీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం జనాభాలో 75 శాతం మందికి మాత్రమే ఉచితంగా బియ్యం పంపిణీ చేయ్యాలని నిబంధన ఉన్న రాష్ట్రంలో మాత్రం అర్హతే ప్రమాణికంగా 90 శాతం మందికి పైగా బియ్యం కార్డులు అందించి బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 14,92,004 బియ్యం కార్డులు ఉన్నాయని, వీటిలో 8,54,265 ఎన్ఎఫ్ఎస్ఏ బియ్యం కార్డులు ఉన్నాయన్నారు. ఈ పాస్ డివైజ్ ద్వారా 2803 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ బియ్యంను 901 ఎండీయుల ద్వారా లబ్ధిదారుల ఇంటిముంగిటకే పంపిణీ చేస్తున్నామన్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం కార్డులు అందించటం జరుగుతుందన్నారు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీరును నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హతే ప్రమాణికంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించటం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిని సైతం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయటం జరుగుతుందన్నారు. మహిళా సాధికారికతలో భాగంగా సంక్షేమ పథకాల లభ్ధిని మహిళలకే అందించటంతో పాటు పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా జిల్లాలో దాదాపు 3 లక్షల ఇంటి పట్టాలను మహిళల పేరుతోనే ఇవ్వటం జరిగిందన్నారు. ఇంటి స్థలాలలో మొదటి విడతలో 1,20,000 గృహాల నిర్మాణాలు ప్రారంభించామన్నారు.
సమావేశంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కన్వీనర్ జిల్లా పౌర సరఫరాల అధికారిణి పద్మశ్రీ, సభ్యులు సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజరు జయంతి, సోషల్ వేల్ఫేర్ డీడీ మధుసూదనరావు, తూనికలు కొలతల శాఖ జిల్లా కంట్రోలర్ సలీం రాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గౌస్ మొహీద్దీన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి దుర్గాబాయి, జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరక్టర్ మనోరంజని, జిల్లా విద్యాశాఖ అధికారిణి గంగా భవానీ, జిల్లా వినియోగదారుల సమాచార విభాగం ఇన్చార్జి చదలవాడ హరిబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, రేషన్ దుకాణాల అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు వైఏబీ ప్రసాదు, సివిల్ సప్లయిస్ అధికారులు పాల్గొన్నారు.