రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ నుంచి వర్షపు నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపధ్యంలో అధికారులంతా అప్రమత్తమంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, తెనాలి, గురజాల డివిజన్ల రెవెన్యూ అధికారులు, తహాశీల్ధార్ల తో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్( రైతు భరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్(సచివాలయాలు-అభివృద్ధి) పి.ప్రశాంతి, సంయుక్త కలెక్టర్( ఆసరా-సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్యలతో కలిసి అకాల వర్షాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లడుతూ జిల్లాలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఎవ్వరూ ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పధకాలు అమలులో ఎక్కడా జాప్యం జరగకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణతో పని చేయాలన్నారు. ప్రధానంగా భూసేకరణ ద్వారా పేదలకు ఇళ్ళ స్థలాలు, భూముల రీసర్వే, కౌలు రైతు కార్డులు, రైసు కార్డులు, రైల్వేలైన్ల డబ్లింగ్ పనులకు భూసేకరణ, జగనన్న కాలనీల అభివృద్ధి, చిలకలూరిపేట బైపాస్ రహదారి నిర్మాణానికి భూములు సేకరణ, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలకు స్థలాలు, కోవిడ్ నివారణ చర్యలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, జమాబంది, త్వరితగతిన పేదప్రజల సమస్యల పరిష్కారం, సచివాలయాల్లో సిబ్బంది విధులు, వాలంటీర్ల వ్యవస్థల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారులు సకాలంలో కోర్టు కేసుల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. మీసేవ కేంద్రాల్లో ప్రజలు,రైతుల నుంచి వస్తున్న సమస్యలను త్వరిత గతిన విచారించి తాత్సారం చేయకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
సంయుక్త కలెక్టర్( రైతు భరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను లబ్ధిదారులకు అందేలా రెవెన్యూ అధికారులు వేగం పెంచాలని అన్నారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ పధకాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టం వలన మండల అధికారులు, సిబ్బందిలో జవాబు దారితనం పెరుగుతుందన్నారు. తరచూ సంక్షేమ పధకాల అమలులో వెనుకబడుతున్న మండలాలను రెవెన్యూ అధికారులు గుర్తించి, మండల అధికారులు, రెవెన్యూ సిబ్బందికి ఆధునిక సాంకేతిక వ్యవస్థ విధానంపై తగిన శిక్షణఇప్పించి పనుల వేగం పెరిగేలా చూడాలన్నారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తున్న మండలాలను గుర్తించి సత్వర పరిష్కారం చూపడానికి గల అవకాశాలను అధికారులు అందిపుచ్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పధకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేస్తున్నారని, అందుకు అనుగుణంగా మనం కూడా ప్రజా సమస్యల సత్వర పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు. దీంతో పాటు సంక్షేమ పధకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో గుంటూరు డివిజన్ ఆర్.డి.ఒ భాస్కరరెడ్డి, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.