ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని, అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోదక చట్టం, పౌర హక్కుల రక్షణ చట్టం అమలుపై తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి స్థితిని, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాంఘిక సంక్షేమశాఖ డిప్యుటీ డైరెక్టర్ కె.సునీల్ రాజ్‌కుమార్ వివరించారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 163 కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది 18 కేసులు నమోదు కాగా, వాటిలో 4 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేయడం జరిగిందని, మిగిలిన 14 కేసులకు ఛార్జ్‌షీట్ పెండింగ్ ఉందని ఎఎస్‌పి శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, అత్యాచార చట్టం క్రింద నమోదు చేసిన కేసుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల వారీగా సమీక్షించి, ఎస్‌సి, ఎస్‌టి కాలనీలకు రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు, త్రాగునీటి సమస్య, తదితర వాటికి సంబంధించిన ఉన్నతాధికారులతో తక్షణమే మాట్లాడి, వాటిని పరిష్కరించాలని సూచించారు.
అట్రాసిటీ కేసులు నమోదైన, సంఘటనలు చోటుచేసుకున్న గ్రామాల్లో శాంతి కమిటీలను వేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతీనెలా 30వ తేదీ లేదా చివరి రోజున సివిల్ రైట్స్ డే నిర్వహించాలని సూచించారు. ఆ రోజున రెవెన్యూ, పోలీసు అధికారులు ఏదో ఒక గ్రామాన్ని లేదా కాలనీని సందర్శించి, అక్కడి ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. అట్రాసిటీ కేసుల పరిష్కారంపైనా, సివిల్ రైట్స్ డే నిర్వహణ పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సబ్ కలెక్టర్, ఆర్‌డిఓలను కోరారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల్లో దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్, జాయింట్ కలెక్టర్(సంక్షేమం) జె.వెంకటరావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, సోషల్ వెల్ఫేర్ డిడి కె.సునీల్‌రాజ్‌కుమార్, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, పిఆర్ ఇఇ విజయ్‌కుమార్, డిఎస్‌పి అనిల్‌కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.