ఎస్సీ, ఎస్టీ కేసులు సత్వర పరిష్కారం..


Ens Balu
4
Kakinada
2021-07-23 15:13:57

తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసుల త‌క్ష‌ణ ప‌రిష్కారానికి ప‌టిష్ట ప్ర‌ణాళిక ప్ర‌కారం గ్రామ‌, మండ‌ల‌, జిల్లాస్థాయిలో కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లోని విధాన గౌత‌మి స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ (ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీస్‌) స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి, అద‌న‌పు ఎస్‌పీ క‌ర‌ణం కుమార్‌, ఎంఎల్‌సీ పండుల ర‌వీంద్ర‌బాబు, పి.గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యులు కొండేటి చిట్టిబాబు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో మొద‌ట క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. జిల్లాకు సంబంధించి ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసులు, విచార‌ణ పురోగ‌తి, పెండింగ్ కేసుల ప‌రిష్కార ప్ర‌ణాళిక‌, బాధితుల‌కు ప‌రిహారం, బాధిత కుటుంబ స‌భ్యుల‌కు ఉద్యోగాలు త‌దిత‌ర వివ‌రాల‌తో పాటు గ‌తంలో క‌మిటీ చ‌ర్చించిన అంశాల‌పై కార్యాచ‌ర‌ణ నివేదిక‌ను స‌మావేశం ముందుంచారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మూడు నెల‌ల‌కోసారి క‌మిటీ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని, గ‌త మార్చిలో జ‌రిగిన స‌మావేశానికి గౌర‌వ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారని, ఆ స‌మావేశంలో చ‌ర్చించిన అంశాల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కోవిడ్ కార‌ణంగా ఈసారి స‌మావేశం కొంత ఆల‌స్య‌మైంద‌న్నారు. 
ఎస్‌సీ, ఎస్‌టీల‌పై వేధింపుల‌కు సంబంధించిన కేసుల త‌క్ష‌ణ ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఇది అత్యుత్త‌మ వేదిక అని, అందువ‌ల్ల ఈ క‌మిటీ స‌మావేశాన్ని ప్ర‌భావ‌వంతంగా ఉప‌యోగించుకోవాల్సి ఉంద‌న్నారు. పెండింగ్ కేసుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వ‌చ్చే సోమ‌వారం నుంచి స్పంద‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఫిర్యాదులు అందించేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని కూడా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు. బాధితుల‌కు స‌రైన న్యాయం జ‌రిగే విష‌యంలో ప‌క్ష‌పాత ధోర‌ణి లేకుండా సేవలందించాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు వెల్ల‌డించారు. కేసుల పురోగ‌తి స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు బాధితుల‌కు తెలియ‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు.

జాప్యం లేకుండా ప‌రిహారం:
చ‌ట్టం ప‌రిధిలో బాధితుల‌కు వీలైనంత త్వ‌రగా ప‌రిహారం అందేలా చూస్తున్నామ‌ని, వారికి పూర్తి భ‌రోసా క‌ల్పించే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. బాధిత కుటుంబాల‌కు చెందిన 29 మందికి ఉద్యోగాలు ఇచ్చామ‌ని, మ‌రో కేసుకు సంబంధించి త్వ‌ర‌లో ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. 2018 నుంచి 2021, మే 31 వ‌ర‌కు చూస్తే 617 కేసుల‌కు సంబంధించి 405 కేసుల్లో బాధితుల‌కు రూ.3,81,48,750 మేర ప‌రిహారం అందించిన‌ట్లు వెల్ల‌డించారు. డివిజ‌న‌ల్ స్థాయిలోనూ క‌మిటీ స‌మావేశాలు క్ర‌మంత‌ప్ప‌కుండా నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఇందుకు సంబంధించి డివిజ‌న‌ల్ ఉన్న‌తాధికారుల‌కు మార్గ‌నిర్దేశ‌నం చేస్తున్న‌ట్లు తెలిపారు. వ‌చ్చే జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ (ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీస్‌) స‌మావేశాన్ని సెప్టెంబ‌ర్ 24న నిర్వ‌హించ‌నున్నామ‌ని, క‌మిటీ స‌భ్యులు ద్వారా ఎవ‌రైనా స‌మ‌స్య‌ల‌ను స‌మావేశం దృష్టికి తీసుకురావ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. 

కీల‌క అంశాల‌ను లేవ‌నెత్తిన క‌మిటీ స‌భ్యులు
స‌మావేశంలో జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ స‌భ్యులు న‌క్కా చిట్టిబాబు, ఎ.రామేశ్వ‌ర‌రావు, పిడుగు రాముడు, కొమ్ము చిన‌బాబు, బీవీవీఎస్ఎస్ మూర్తి, బూర కృష్ణ‌వేణి, జంగా బాబూరావు ప‌లు కీల‌క అంశాల‌ను లేవ‌నెత్త‌గా.. ఉన్న‌తాధికారులు వివ‌ర‌ణ ఇచ్చారు. స‌భ్యులు లేవ‌నెత్తిన ప్ర‌ధాన అంశాల‌ను ప‌రిశీలించి, అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. కేసుల ప‌రిష్కారం, ప‌రిహారం విష‌యంలో త్వ‌రిత‌త‌గిన నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు వివ‌రించారు. జిల్లాస్థాయిలో అట్రాసిటీ కేసుల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే క‌మిటీ స‌మావేశం దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు.

ఎస్‌సీ, ఎస్టీల‌కు సంబంధించి ప్ర‌తి కార్య‌క్ర‌మం పూర్తిస్థాయిలో అమ‌ల‌వుతుంద‌ని, ఈ విష‌యంలో ఎలాంటి అపోహ‌లు అవ‌స‌రం లేద‌ని ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. కోవిడ్ నేప‌థ్యంలో ఆర్థికంగా స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయ‌ని, కోవిడ్ బాధితుల‌కు పూర్తిస్థాయి వైద్య సేవ‌లు అందించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక ప్ర‌కారం సేవ‌లందించింద‌న్నారు. విధాన‌ప‌ర నిర్ణ‌యాల‌కు సంబంధించి గౌర‌వ ముఖ్య‌మంత్రితో చ‌ర్చించ‌నున్న‌ట్లు పండుల ర‌వీంద్ర‌బాబు వెల్ల‌డించారు.  

క‌మిటీ స‌భ్యులు లేవ‌నెత్తిన వివిధ అంశాల‌ను గౌర‌వ ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు పి.గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యులు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. భార‌త‌ర‌త్న బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ ఆశ‌యాల స్ఫూర్తిగా ఎస్‌సీ, ఎస్‌టీల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. ఎస్‌సీ, ఎస్‌టీల భ‌ద్ర‌త‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యధిక ప్రాధాన్య‌మిస్తోంద‌ని, క్షేత్ర‌స్థాయిలో అధికారుల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ అట్రాసిటీ కేసుల త‌క్ష‌ణ ప‌రిష్కారానికి, బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు కృషిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

అన్ని అంశాల‌పైనా నిశిత ప‌రిశీల‌న‌: జేసీ జి.రాజ‌కుమారి
జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ (ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీస్‌) స‌మావేశంలో స‌భ్యులు లేవ‌నెత్తిన అన్ని అంశాల‌నూ ప‌రిశీలించి, అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్న‌ట్లు జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి తెలిపారు. స‌భ్యులు చాలా విలువైన అంశాల‌ను క‌మిటీ దృష్టికి తీసుకొచ్చార‌న్నారు. బాధితుల‌కు న్యాయం జ‌రిగే విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే వెంట‌నే ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌న‌బ‌డి-నాడు నేడు ద్వారా పాఠ‌శాల‌లు, సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను ఆధునికీక‌రిస్తున్న‌ట్లు జేసీ వెల్ల‌డించారు. సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు ఎస్‌సీ, ఎస్‌టీల‌కు పూర్తిస్థాయిలో అందించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వివ‌రించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగ‌ల‌క్ష్మీదేవి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వ‌ర‌ప్ర‌సాద్‌, ఎస్‌సీ కార్పొరేష‌న్ ఈడీ సునీత‌, సాంఘిక సంక్షేమం, పోలీస్‌, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.