పని ఒత్తిడితో అలసిపోయినవారికి, క్రీడలతో నూతనోత్సాహం కలుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. స్థానిక సర్ విజ్జీ క్రీడా మైదానంలో సుమారు రూ.35లక్షలతో ఆధునీకరించిన క్రికెట్ స్టేడియంను, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. రెవెన్యూ అధికారుల క్రీడాపోటీలను కలెక్టర్, ఎంఎల్ఏలు ప్రారంభించారు. ఇద్దరూ కొద్దిసమయం క్రికెట్ ఆడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్ లాల్ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నియంత్రణలో గానీ, ఇతర దైనందిన పనులతో గానీ, రెవెన్యూ అధికారులు నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతున్నారని, వారికి కాస్త ఉల్లాసం కల్గించేందుకు కల్గించేందుకు ఇటువంటి క్రీడాపోటీలు దోహదం చేస్తాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వారికి పునరుత్తేజం కల్గిస్తాయన్నారు. విజ్జీ స్టేడియాన్ని అభివృద్ది చేసేందుకు ఎంతో ఆస్కారం ఉందని, ఆధునిక వసతులను కల్పిస్తే, అంతర్జాతీయ స్థాయి పోటీలకు కూడా ఇక్కడ నిర్వహించవ్చని అన్నారు. స్టేడియం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పట్టణ పరిదిలో పచ్చదనం పెంచేందుకు ఎంఎల్ఏ కృషి చేస్తున్నారని కలెక్టర్ అభినందించారు.
ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, నిత్యం బాధ్యతల్లో మునిగిఉండే రెవెన్యూ సిబ్బందికి, ఇలాంటి క్రీడాపోటీలు ఒక అటవిడుపుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం క్రింద విస్తృతంగా మొక్కలను నాటుతున్నామని అన్నారు. పట్టణ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో, రెండేళ్ల క్రితం నుంచే పట్టణంలో లక్షలాదిగా మొక్కలను నాటి, హరిత విజయనగరంగా మార్చినందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ను కొనియాడారు. అభివృద్ది కార్యక్రమాలతోపాటుగా, క్రీడాభివృద్దికి కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో, విజ్జీ స్టేడియంను అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. విద్యలతోపాటుగా, క్రీడలకు కూడా విజయనగరం జిల్లా ఎంతో ప్రసిద్ది అని, ఆ పేరును నిలబెట్టేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామని కోలగట్ల పేర్కొన్నారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సిఇఓ శివానంద రెడ్డి మాట్లాడుతూ, విజ్జీ స్టేడియంకు ఇప్పటికే గొప్ప గుర్తింపు ఉందని అన్నారు. ఈ స్టేడియంలో భారతజట్టు క్రీడాకారులు వివిఎస్ లక్ష్మణ్, రాబిన్ సింగ్, జిఆర్ విశ్వనాధ్ కూడా క్రికెట్ ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. మైదానాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ఏసిఏ తరపున సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఎంఓయు చేయాల్సి ఉందని, దానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. యువత అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే, క్రీడా సౌకర్యాలను కూడా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, మయూర్ అశోక్, జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, సెట్విజ్ సిఇఓ విజయ్‌కుమార్, క్రీడాధికారి వెంకటేశ్వర్రావు, ఏసిఏ ట్రెజరర్ గోపీనాధరెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంఎల్ఎన్ రాజు, కోశాధికారి రాంబాబు, పలువురు కార్పొరేటర్లు, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు తాడ్డి గోవింద,తాశీల్దార్ ఎం.ప్రభాకరారవు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పోటీల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్రికెట్ ఆడి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు.