తూర్పుగోదావరి జిల్లాకు రెండేళ్ల పాటు కలెక్టర్‌గా సేవలందించి, పదోన్నతిపై రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీగా బదిలీపై వెళ్తున్న డి.మురళీధర్‌రెడ్డి, హేమ దంపతులకు అధికారులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. శనివారం కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) అధ్యక్షతన ఉద్వేగభరిత వాతావరణంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో కలెక్టర్ దంపతులను జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. విశిష్ట అతిథులుగా హాజరైన ఎస్‌పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తదితరులు కలెక్టర్ దంపతులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందించి రెండేళ్ల కాలంలో ఆయన జిల్లాకు అందించిన సేవలను కొనియాడారు. జిల్లా అత్యున్నత అధికారితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాన్ని లాగుతూ పోలీస్ బ్యాండ్‌తో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ దంపతులకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి అధికారి అఖిల భారత సర్వీసు అధికారేనని విధి నిర్వహణలో దీక్షాదక్షతతో, కష్టించి పనిచేసి తూర్పుగోదావరిని ముందు వరుసలో నిలిపారని పేర్కొన్నారు. జిల్లాస్థాయి మొదలు గ్రామంలోని సచివాలయం వరకు ప్రతి కార్యక్షేత్ర సిబ్బంది సమన్వయంతో పనిచేశారని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొన్నారని, వీరితో తన అనుబంధం మరువలేనిదన్నారు. ఏ అధికారి అయినా పదవీ విరమణ పొంది వెళ్లేటప్పుడు మాత్రమే తన దిగువ స్థాయి సిబ్బంది కళ్లలో నీళ్లు చూడాలేగానీ పనిచేస్తున్న సమయంలోనే వారి కళ్లలో నీళ్లు చూడకూడదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని యువ అధికారులు విధులు నిర్వహించాలని.. బృంద స్ఫూర్తి, సమానతతో సమన్వయంతో పేదల సంక్షేమం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సవాళ్లు వస్తుంటాయని.. అయితే వాటిని సానుకూల దృక్ఫథంతో ఎదుర్కోవాలన్నారు. రెండేళ్ల కాలంలో జిల్లా ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని, మూడున్నర లక్షల ఇళ్ల పట్టాలు అందించడం, కోవిడ్ రెండు దశలనూ ఎదుర్కోవడం వంటివి అత్యంత సంతృప్తినిచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రెండేళ్లకాలంలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా డీబీటీతో జిల్లా ప్రజలకు రూ.10 వేల కోట్లు మేర లబ్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా, భౌగోళికంగా వైవిధ్యమున్న జిల్లాలో సేవలందించే అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ సోదర సమానులు అయిన మురళీధర్‌రెడ్డి రెండేళ్ల కాలంలో పోలీసు శాఖకు ఎంతో మేలు చేశారని, కారుణ్య నియామకాల్లో ఎక్కడా పెండింగ్ లేకుండా చూశారని.. ఇందుకు పోలీసు శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
గురు సమానులు: జేసీ(ఆర్) డా. జి.లక్ష్మీశ
నిరాడంబరతతో ఆదర్శనీయ లక్షణాలతో పనితీరులో అత్యున్నత ఫలితాలు సాధిస్తున్న మురళీధర్‌రెడ్డిగారు తనకు గురుసమానులని, ఆయన్నుంచి రెండేళ్ల కాలంలో ఎంతో నేర్చుకున్నానని జాయింట్ కలెక్టర్ (ఆర్) డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. నలువైపుల నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎక్కడా ఒత్తిడి అనే మాట లేకుండా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. ముఖంపై చిరునవ్వును చెదరనివ్వకుండా, విధి నిర్వహణ పరంగా రాజీపడకుండా సేవలందించారన్నారు. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలు తన భవిష్యత్ కెరీర్‌కు మార్గదర్శనంగా ఉంటాయని తెలిపారు. చాలా కీలకమైన ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి విభాగానికి ఎండీగా వెళ్తున్నారని, ఆయన ద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా రానున్న 16 బోధనాసుపత్రుల్లో వసతుల కల్పనలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని జేసీ లక్ష్మీశ పేర్కొన్నారు.
- జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తారని, అయితే కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి హయాంలో పనిచేయడం మరింత అదృష్టమని పేర్కొన్నారు. సమయపాలన, సానుకూల దృక్పథం, బృంద స్ఫూర్తి, సరైన సమయంలో వేగవంతంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన ప్రణాళిక, విపత్తు నిర్వహణ నైపుణ్యాలు, క్షేత్రస్థాయికి సక్రమ సమాచార పంపిణీ వంటి విశిష్ట లక్షణాలు ఆయనలో చూశామని పేర్కొన్నారు. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో ఆయన చూపిన పనితీరు ప్రశంసనీయమన్నారు. డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, కాకినాడ, రాజమహేంద్రవరం కమిషనర్లు స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అభిషిక్త్ కిషోర్, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు ఎ.వెంకట రమణ, సీవీ ప్రవీణ్ ఆదిత్య; రాజమహేంద్రవరం, రంపచోడవరం సబ్ కలెక్టర్లు ఇలాక్కియా, కట్టా సింహాచలం, అదనపు ఎస్‌పీ కరణం కుమార్, ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ కమాండెంట్ సుమిత్ గరుడ్, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ; జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ; డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, డీపీవో ఎస్వీ నాగేశ్వర్ నాయక్ , డీఎంహెచ్‌వో డా.కేవీఎస్ గౌరీశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగలక్మీదేవి, డీడీ ట్రేజరరీ శర్మ, సివిల్ సప్లయ్‌స్ జెడ్ ఎం డి.పుష్పమణి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, ప్రతినిధులు; కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, రెడ్‌క్రాస్ ఛైర్మన్ వైడీ రామారావు; కాకినాడ, పెద్దాపురం, అమలాపురం డివిజినల్ అధికారులు.. ఏజీ చిన్నికృష్ణ, ఎస్.మల్లిబాబు, ఎస్.వసంతరాయుడు తదితరులు హాజరయ్యారు.