రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం లక్ష్యంగా వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలుచేస్తోందని కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులతో కలిసి ఎమ్మెల్యే కాకినాడలోని గాంధీనగర్-ఎల్విన్‌పేటలో డా. బీఆర్ అంబేడ్కర్ సామాజిక భవనం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత భారత రత్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం సామాజిక భవన విస్తరణలో భాగంగా నిర్మించిన ప్రాంగణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. పుట్టి పెరిగిన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే అదృష్టం లభించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఎల్విన్‌పేట పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నామని, రూ.6 కోట్ల ఖర్చుతో రిటైనింగ్ వాల్ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత రత్న డా. బీఆర్ అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తిగా ప్రజల సమస్యలను గుర్తించి, తక్షణ పరిష్కారం దిశగా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మున్ముందు ఇదే స్థాయిలో స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ ఆకాంక్షించారు. శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నేతృత్వంలో కాకినాడలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్రాంత అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.పవన్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.సత్యకుమారి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.