స్పందన కార్యక్రమాన్ని జిల్లాలో సోమవారం నుండి గ్రామసచివాలయాల్లో ప్రారంభి స్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. వాక్సినేషన్, స్పందన కార్యక్రమాలపై ఆదివారం సంభందిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయాలలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పింఛన్లు, రేషన్ కార్డు, ఇళ్లు తదితర సమస్యలకు మొదటి సారిగా అర్జీలు సమర్పించే ప్రజలు గ్రామ సచివాలయంలోనే సమర్పించాలని ఆయన తెలిపారు. సచివాలయ స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. మొదటి సారిగా అర్జీలు సమర్పించుటకు మండల, జిల్లా స్థాయికి రావలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయం స్థాయిలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలకు మాత్రమే మండల, జిల్లా స్థాయికి రావాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనల మేరకు స్పందన కార్యక్రమం నిర్వహించుటకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొంటూ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కే. బ్రహ్మయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు, ఎం.పి.డి.ఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.