తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 26న మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగనుందని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రెండు లక్షల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 45 ఏళ్లు దాటిన వారికి మొదటి డోసుతో పాటు, తొలి డోసు తీసుకొని 84 రోజులు అయిన వారికి రెండో డోసు టీకాలు వేయనున్నట్లు జేసీ తెలిపారు. జిల్లాలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇంకా నాలుగు లక్షల మంది మొదటి డోసు తీసుకోవాల్సి ఉందని, అదే విధంగా రెండో డోసు తీసుకోవాల్సిన వారు 40 వేల మంది ఉన్నారని వీరందరూ తప్పనిసరిగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు, ఉపాధ్యాయులకు కూడా మొదటి డోసు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ (డి) తెలిపారు.