శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ నమోదు సక్రమంగా జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఈ మేరకు వైద్యాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. రెండవ డోసు పూర్తి చేసుకున్న వారి పేర్లు కూడా తిరిగి జాబితాలో చేరుతున్న సందర్బాలు వస్తున్నాయని అటువంటి పరిస్థితులు పునరాృతం కాకుండా చూడాలని ఆయన తెలిపారు. పునరావృతం అయితే వాక్సినేషన్ బృందాల పై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వాక్సినేషన్ కు వచ్చేవారి ఫోన్ నంబర్లను రెండు డోసుల సమయంలో జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్ లకు నమోదు కార్య్రమంలో అనుభవం ఉందని ఆయన తెలిపారు. వాక్సినేషన్ కు వచ్చే ప్రతి 50 మందికి పర్యవేక్షణకు ఒక ఉద్యోగిని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఉదయం 8 గంటలకు వాక్సినేషన్ ప్రారంభం కావాలని, ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, మున్సిపల్ కమిషనర్లు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి పక్కాగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కే. బ్రహ్మయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు, ఎం.పి.డి.ఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.