ప్రత్యేక ప్రణాళికతో పనులు వేగం..
Ens Balu
0
Srikakulam
2021-07-25 14:20:09
సరైన కార్యాచరణ ప్రణాళికతో పనులను ప్రగతి దిశగా వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న భవన నిర్మాణ పనులలో తక్కువ ప్రగతి ఉన్న మండలాలతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదివారం సమీక్షించారు. భవన నిర్మాణ పనులు వేగవంతం కావాలని ఆయన అన్నారు. స్థల సమస్య ఉంటే తక్షణం పరిష్కరించు కోవాలని ఆయన ఆదేశించారు. భవన నిర్మాణాలు పూర్తి కాలేదు అంటే అక్కడ పని చేస్తున్న సిబ్బందికి అన్యాయం చేస్తున్నట్లు భావించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రగతి మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భవన నిర్మాణాలు తమ హయాంలో పూర్తి చేయడాన్ని గర్వంగా ఫీల్ కావాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని దానిని సాధించాలని ఆయన పేర్కొన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాల నిర్మాణం కూడా జరగాలని ఆయన చెప్పారు. అవసరమైతే ఇసుకను ఎడ్ల బండ్లపై తీసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. పనులు ఎందుకు జాప్యం జరుగుతోంది అని చెప్ప వద్దని, ఏ విధంగా చేయడం వలన వేగవంతం చేయవచ్చో చెప్పాలని ఆయన అన్నారు. మొదటి మూడు స్థానాలకు చేరుటకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. పోలాకి, పొందూరు, మెలియాపుట్టి, సరుబుజ్జిలి, కోటబొమ్మాళి, రణస్థలం, కవిటి, పలాస, ఆమదాలవలస తదితర మండలాలు భవన నిర్మాణ ప్రగతిలో చివరి స్థానాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కే. బ్రహ్మయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు, ఎం.పి.డి.ఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.