రాష్ట్ర ప్రభుత్వం ఆపదలో ఉన్న మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ మహిళలకు రక్షణగా నిలుస్తుందని కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర మేయర్ సుంకర పావని, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కన్వెన్షన్ హాల్ లో దిశ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రత్యేకంగా మహిళలు, బాలికల పట్ల జరిగే నేరాల సత్వర దర్యాప్తు కోసం ఏర్పాటు దీనిని ఏర్పాటు చేశారన్నారు. యాప్ మహిళల వద్ద వుంటే పక్కనే రక్షణ వున్నట్టేనన్నారు. ఇప్పటికే దిశ యాప్ అనేక ఫలితాలు సాధించి ఆపదలో వున్న మహిళలను రక్షిస్తున్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో 3,44,015 మంది మహిళలు తమ ఫోన్ లలో దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. నెలాఖరు ఈ సంఖ్యను ఐదు లక్షలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
రాష్ట్రం లోనే తూర్పుగోదావరి జిల్లా ను ప్రధమ స్థానం లో నిలపాలంటే అధిక స్థాయిలో మహిళలు, విద్యార్ధినిలు ఈ యాప్ ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు.
కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు నగరంలో ఉన్న అందరితో దిశ యాప్ డౌన్లోడ్స్ చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఈ దిశ పోలీస్ స్టేషన్ ను కాకినాడ లో తనతోనే ప్రారంభింప చేయించారని, ఇది తనకు చాలా సంతోషకర విషయమని.. ముఖ్యంగా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో అనే ఉద్దేశంతో తను కాల్ చేయగా వెంటనే పోలీస్ వారు ఫోన్ చేసి అమ్మ మీరు ఏమైనా ఆపదలో వున్నారా అని అడిగారని, ఇంత వెనువెంటనే స్పందన రావడం చాల అశ్చర్యం కలిగించిందన్నారు. కుడా చైర్మన్ రాగిరెడ్డి దీప్తి చంద్రకళ, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఐసిడిఎస్ అధికారి జివి సత్యవాణి, కాకినాడ స్మార్ట్ సిటీ అల్లి రాజబాబు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.