ఈఎన్ఎస్ వార్తపై స్పందించిన ఎస్పీ..
Ens Balu
4
Kakinada
2021-07-26 14:25:11
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసులను ముందు హోంశాఖ పోలీసులుగా గుర్తించండి.. మీరంతా వారిని మీతోపాటు సాధారణ పోలీసులుగా ఒప్పుకోండి.. మీకు ఇష్టం లేకపోయినా ఒప్పుకొని తీరాలి.. అంతే తప్పా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవద్దు అంటూ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ జిల్లాలోని అన్ని స్టేషన్ల ఎస్ఐలకు, కానిస్టేబుళ్లకు సూచించారు.. అంతేకాకుండా ఏ స్థాయి పోలీసు సిబ్బంది మహిళా పోలీసులను ఏ విధంగా చూస్తున్నారో తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. దీనితో ఈఎన్ఎస్ ఇటీవల ప్రచురించిన న్యూస్ కార్డ్..ఖాకీ చొక్కాలేదు.. చేతిలో లాఠీ అసలేలేదు.. అనేవార్తకు స్పందన వచ్చినట్టైంది. ఈ వార్తలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రస్తావించిన అంశాలన్నీ ఎస్పీ ఈ వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల నుంచి ఎస్ఐలు, సచివాలయ మహిళా పోలీసులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వం వారిని పోలీసులుగా గుర్తిస్తూ జీఓ నెంబరు 59 విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ..దాని ప్రకారం వారంతా హోం డిపార్ట్ మెంటు పోలీసులేనని స్పష్టం చేశారు. అసలు దానికంటే ముందు వచ్చిన జీఓనెంబరు 129లోని మహిళా సంరక్షణా కార్యదర్శి(జిఎంఎస్కే) అనే పదాన్ని అన్నిస్టేషన్ల ఎస్ఐలు, కానిస్టేబుళ్లు మరిచిపోవాలని ఆదేశించారు. ఆ జీఓ ద్వారా అపుడు వారంతా జీఎంస్కేలు అయితే..జీఓనెంబరు 59 ద్వారా ఇపుడు వారంతా సాధారణ పోలీసులేనన్నారు. కాకపోతే మహిళలు కనుగా ప్రభుత్వం మహిళా పోలీసు అని నామకరణం చేసిందన్నారు. అంతే తప్పా వారంతా మనకి సంబంధం లేని ఉద్యోగులుగా చూడొద్దని పోలీసులను హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసిన జీఓలపై స్టేషన్ ఎస్ఐలకు అవగాహ ఉండాలని.. దానిని వెంటనే సచివాలయ మహిళా పోలీసులకు వివరించి చెప్పాలన్నారు. విధినిర్వహణలో ఎవరు అవినీతికి పాల్పడినా..వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల పరిధిలోని మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొందరు మహిళా పోలీసులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎస్పీ ద్రుష్టికి తీసుకెళ్లారు. మహిళా పోలీసులకు ఎలాంటి సమస్యలున్న తక్షణమే నోడల్ ఆఫీసరైన స్టేషన్ ఎస్ఐ ద్రుష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్సులో అన్ని డివిజన్ల డిఎస్పీలు, సిఐలు, స్టేషన్ ఎస్ఐలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసులు పాల్గొన్నారు.