మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అనువైన సమయమని, మొక్కలు నాటి అవి బ్రతుకుటకు విధిగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు దృష్టి సారించాలని ఆయన సూచించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఆయన ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ లతో ముఖ్య మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయని, అయినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం పట్ల దృష్టి సారించాలని ఆయన సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రాదాన్యత క్రమంలో వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని ఆయన అన్నారు. మూడవ దశ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి రైతు ఇ క్రాప్ లో నమోదు కావాలని ఆయన అన్నారు. గృహ పట్టాలకు దరఖాస్తు చేసిన వారికి వెంటనే జారీ చేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలో భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు అధికం చేయాలని ఆయన అన్నారు. గ్రామ సచివాయాలను తనిఖీ చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. పింఛన్లు, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు జారీ నిర్దేశిత సమయంలో జరగాలని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్లు ప్రభుత్వానికి కళ్ళు చెవులు అన్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉన్నది లేనిది పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఆగస్టులో నేతన్న నేస్తం 10వ తేదీన, విద్యా కానుక 16వ తేదీన, 20 వేలులోపు అగ్రీ గోల్డ్ పరిహారం 24 వ తేదీన, ఎం.ఎస్.ఎం.ఇలకు 27 వ తేదీన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ వీడియో కన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు, వ్యవసాయ శాఖ జేడి కే. శ్రీధర్, సిపిఓ ఎం. మోహన రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ పి. కూర్మి నాయుడు, ఆర్ అండ్ బి ఎస్ఇ కే. కాంతిమతి, పంచాయతి రాజ్ ఎస్ఇ కే.బ్రహ్మయ్య, ప్రజా ఆరోగ్య శాఖ ఇఇ పి. సుగుణకర రావు తదతరులు పాల్గొన్నారు.