సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలి..


Ens Balu
2
Srikakulam
2021-07-27 16:50:23

శ్రీకాకుళం జిల్లాలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ వర్షాకాలం రావడంతో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా మున్సిపల్ కమీషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా మలేరియా అధికారి, వైద్యఆరోగ్య శాఖాధికారి మరియు గ్రామీణ నీటి సరఫరా విభాగాధిపతులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమలు వలన వచ్చే సీజనల్ వ్యాధులను నివారించేందుకు ప్రతీవారం క్లోరినేషన్ మరియు ఫాగింగ్ ఖచ్చితంగా చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి మునిసిపల్ పరిధిలో తాగునీటిని క్లోరినేషన్ చేసి నీటి నిల్వలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే గ్రామస్థాయిలో నీటి కొళాయిలు దెబ్బతిని నీటి నిల్వలు ఏర్పడినట్లయితే తక్షణమే అధికారులు స్పందించి మరామ్మతులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలపై అధికారులు నిర్లక్ష్యధోరణి కనబరచరాదని, తద్వారా మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యూ, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని చెప్పారు. ప్రస్తుతం గ్రామ, వార్డుస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ ఉన్నందున వారి ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.  ప్రతీ పి.హెచ్.సి కేంద్రాల్లో మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి టెస్టులు చేసేందుకు వీలుగా కిట్లను మరియు మందులను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధిపతులు ప్రతీ వారం చేపట్టిన ప్రగతి నివేదికలను తమకు సమర్పించాలని ఆదేశించారు. డెంగ్యూ, చికెన్ గున్యూ, జికా వైరస్ ఎడిస్ దోమ వలన వస్తుందని, గంబూషియా చేపల ద్వారా ఈ ఎడిస్ దోమలను లార్వా దశలోనే నివారించాలని సూచించారు. సీజనల్ వ్యాదులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యల డాక్యుమెంటరినీ వాట్సాప్ గ్రూపు ద్వారా  గ్రామ, వార్డు వాలంటీర్లకు పంపి అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున మునిసిపల్ కమీషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుద్ధ్యం పనులతో పాటు క్లోరినేషన్, ఫాగింగ్ ప్రతీ వారం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తొలుత జిల్లా మలేరియా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్ కమీషనర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం చేపడుతున్న ప్రగతిని కలెక్టర్ కు వివరించారు.

          ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఐటిడిఏ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా మలేరియా అధికారి , జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ ఓబులేసు, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, పాలకొండ, రాజాం, ఇచ్చాపురం మునిసిపల్ కమీషనర్లు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.