రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు ఎస్.సిలు, ఎస్.టిలకు కూడా సమన్యాయాన్ని అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంపులు మరియు రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. జిల్లాలో ఎస్.సిలు, ఎస్.టిలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలు, దాడులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని, దోషులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ప్రతీ ఒక్కరికి సమన్యాయం తప్పక లభిస్తుందని అభిప్రాయపడ్డారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్.సి., ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం, అట్రాసిటీ కేసులపై విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో మెరుగైన స్థితి కనిపిస్తుందని ఇది శుభపరిణామమని అన్నారు. ఎస్.సిలు, ఎస్.టిలు తమ హక్కులు గురించి ఏ విధంగా ప్రశ్నిస్తున్నారో, అంతే బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలోని ఎస్.సిలకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, అందువలనే జిల్లాలో వైషమ్యాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఎస్.సిలు,ఎస్.టిల విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఎస్.సిలు, ఎస్.టిల సమన్యాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విశేషకృషి చేస్తున్నారని, వారితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. కమిటీ సభ్యురాలైన నిమ్మక కళావతి కుటుంబానికి జరిగిన విషయంపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ, కళావతి కుటుంబం ఒంటరిగా పోరాటం చేయడం బాధ కలిగిస్తుందని, ఆమె ఒంటరే అయినప్పటికీ ప్రభుత్వం అన్నివిధాల తగు న్యాయం చేస్తుందని, ఇందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎస్.సిలకు, ఎస్.టిలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే తక్షణమే తమ సమీప పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయాలని, అప్పటికీ స్పందించకుంటే తమ పై అధికారులు లేదా జిల్లా కలెక్టర్ ను సంప్రదించవచ్చన్నారు. అలాగే తమను కూడా సంప్రదించి తమ సమస్యలను తెలియజేసుకోవచ్చని, బాధ్యులు ఎంతటివారైన తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోరాదని హితవు పలికారు. అణగారిన అన్నివర్గాల వారికి సమతుల్యత పాటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ పదవులను కట్టబెట్టడం జరిగిందని, ఉపముఖ్యమంత్రి పదవినే ఎస్.సి మహిళకు కట్టబెట్టిన సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. అలాగే సమర్ధవంతమైన ఎస్.సి,ఎస్.టి మంత్రులు ప్రభుత్వంలో ఎందరో ఉన్నారని, ఇది శుభపరిణామమని అన్నారు. అన్నివర్గాల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, అధికారులంటే ప్రభుత్వానికి అపారమైన గౌరవమని ఉపముఖ్యమంత్రి తెలిపారు. తప్పు జరిగితే దోషులు ఎంతటి వారైన వదలిపెట్టబోమని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ఉద్భోదించారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న అట్రాసిటీ, అత్యాచార కేసులను తక్షణమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని అధికారులను కోరారు. భవిష్యతులో ఏ ఒక్కరూ తమకు న్యాయం జరగలేదని రాకూడాదని, అటువంటి సమాజం జిల్లాలో ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, అందరూ క్షేమంగా ఉండాలనే ప్రభుత్వం పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి వివరించారు.
పాలకొండ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ తగిన న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా మరింత న్యాయం జరిగేలా ఈ సమావేశం చర్యలు తీసుకోవాలని కోరారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో చిల్లంగి, చేతబడి పేరుతో అమాయక కుటుంబాలను మానసికంగా కృంగదీసి, అమానుషంగా గ్రామాల నుండి వెలివేస్తున్నారని, అటువంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేయగా జన విజ్ఞాన వేదిక ద్వారా మారూమూల ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించి గిరిజనుల్లో మార్పును తీసుకువస్తామని వై.సి.బి డైరక్టర్ యం.ప్రసాదరావు జిల్లా కలెక్టర్ కు వివరించారు. సీతంపేటలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలికది నిరుపేద కుటుంబమని, నివశించేందుకు సరైన గృహం కూడా లేదని, కావున ఆమెకు గృహాన్ని మంజూరుచేయాలని కోరగా కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే గృహంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పాలకొండ ఆర్.డి.ఓను ఆదేశించారు. తమ నియోజకవర్గంలోని పలు యస్.సి కాలనీల్లో కనీస సౌకర్యాలు కూడా నోచుకోలేదని, దీనిపై యస్.సి.కార్పొరేషన్ ను సంప్రదించినప్పటికీ ఎటువంటి నిధులు మంజూరుకాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వహిస్తున్న నాడు – నేడు కార్యక్రమం క్రింద కనీస మౌలికవసతులు కల్పించాలని ఆమె కలెక్టర్ ను కోరారు. ఎస్.సి.ఎస్.టి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేయలేదని, వాటిని భర్తీచేయాలని కోరగా పోస్టుల వివరాలను సేకరించి నోటిఫికేషన్ జారీచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులను కలెక్టర్ ఆదేశించారు.
పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ తమ నియోజక వర్గ పరిధిలో ఐదు మండలాల్లో గిరిజనులు నివశిస్తున్నారని, వారు అమాయికులని అటువంటి వారిపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. నాటుసారాలో ఉపయోగించే బెల్లం ఊటను మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు తయారుచేస్తున్నారని వదంతులు వస్తున్నాయని, నిజానికి గిరిజనులు తయారుచేయడం లేదని యస్.పి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సెంట్రల్ ఎక్సైజ్, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కలప తమ నియోజకవర్గం నుండే వెళ్తుందని, దీన్ని కూడా గిరిజనులే చేస్తున్నట్లు వదంతులు వస్తున్నాయని, వీటిపై అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోనే చివరిస్థానంలో పాతపట్నం నియోజకవర్గం ఉందని, దీన్ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా విద్యను అందించాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించడం వలన గిరిజనులు కూడా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు. గిరిజనుల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయని, అటువంటి ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి మూఢనమ్మకాలకు దూరంగా ఉంచాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగులో ఉన్న అట్రాసిటి, అత్యాచార కేసులను డి.ఎస్.పిలు స్వయంగా పర్యవేక్షించి బాధితులకు తగు న్యాయం చేయాలని కోరారు. రానున్న సమావేశానికి ఎటువంటి కేసులు పెండింగు లేకుండా చూడాలని, కావున వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని కోరారు. ఎస్.సిలు,ఎస్.టిల మీద జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను పారద్రోలేందుకే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నామని, అందుకు తగిన విధంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్.సి,ఎస్.టిలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, బాధితులు ఎవరైనా తమకు అన్యాయం జరిగితే పిర్యాదు చేయవచ్చని చెప్పారు. కేసులను బట్టి నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కొన్ని ప్ర్రత్యేకమైన కేసులను బట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, కాని నిజమైన దోషులను ఎప్పటికీ విడిచిపెట్టబోమని, బాధితులకు తగు న్యాయం తప్పక చేసి తీరుతామని ఎస్.పి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్, పాలకొండ, శ్రీకాకుళం రెవిన్యూ డివిజినల్ అధికారులు టి.వి.యస్.జి.కుమార్, ఐ.కిశోర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ.రత్నం, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, నాన్ అఫీషియల్ సభ్యులు కంఠ వేణు, సతివాడ రామినాయుడు, బంటు దుర్గారావు, నిమ్మక కళావతి, స్వచ్ఛంధ సంస్థలు ప్రతినిధులు వై.సి.బి. డైరక్టర్ యం.ప్రసాదరావు, ఆర్ట్స్ సన్యాసిరావు, స్వీప్ కె.రమణమూర్తి, ఎస్.సి,ఎస్.టి సెల్ డి.ఎస్.పిలు, పబ్లిక్ ప్రోసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.