ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి..


Ens Balu
2
Srikakulam
2021-07-28 15:16:59

ఆరోగ్యకరమైన సమాజం కోసం, స్థిరమైన వాతావారణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంపులు మరియు రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్  జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.  ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఏడాది జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం, వాతావరణానికి మొక్కలు పునాది వంటిదని అన్నారు. మానవజాతి దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం భూమి, దాని నుండి లభించే వనరులను ప్రకృతి వనరులుగా పిలుస్తామని, అటువంటి వనరులను భావితరాల కోసం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను ప్రకృతి తీరుస్తుందని, అటువంటి ప్రకృతిని మన అశ్రద్ధ కారణంగా పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ మొక్కను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని, తద్వారా స్వచ్చమైన గాలి, నీరు, వర్షం, వాతావరణం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అలాగే రెడ్ క్రాస్ సంస్థ లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పండగ రోజు, ఇతర పర్వదినాలను పురష్కరించుకొని ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని తెలిపారు.

        ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహన రావు, కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు,  సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి కె.యస్.ప్రభాకరరావు, తహశీల్ధారు వెంకటరావు, రెడ్ క్రాస్ యం.సి మెంబర్స్ పి.శ్రీకాంత్, పెంకి చైతన్యకుమార్, సత్యనారాయణ, విజయ, శ్రీధర్, కోటేశ్వరరావు, చౌదరి రాధాకృష్ణ,లయన్స్ క్లబ్ సభ్యులు బాణాన దేవభూషణరావు, డా. చింతాడ కృష్ణమోహన్, టి.రామగోపాల్, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.