ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలి..


Ens Balu
3
Srikakulam
2021-07-28 15:19:21

శ్రీకాకుళం జిల్లాలోని శాఖాధిపతులు ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి కేటాయించిన నిధులలో యస్.సి , యస్.టిలకు నిధులు తప్పక కేటాయించాలని , ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యస్.సి కాంపోనెంట్ నిధులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు తమ శాఖలకు కేటాయించిన నిధులలో ప్రభుత్వ నిర్ధేశాల మేరకు కేటాయించడం సంతోషకరమని, అయితే గతేడాదిలో ఖర్చుచేసిన వివరాలతో పాటు రానున్న కాలంలో నిధులు కేటాయించేందుకు తీసుకున్న ప్రణాళికల వివరాలు కూడా సమర్పించాలని కోరారు. ప్రతి రెండు మాసాలకు ఒకసారి యస్.సి.కాంపొనెంట్ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉందని, అయితే కొన్ని శాఖలు నిల్ రిపోర్టు చూపాయని, వాటిపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందని,  ప్రతీ సంక్షేమ పథకం ఏదో ఒక శాఖతో ముడిపడి ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని శాఖాధిపతులు సంక్షేమ పథకాల వారీగా కేటాయించిన నిధుల వివరాలతో పాటు యస్.సిలకు, యస్.టిలకు కేటాయించిన, ఖర్చుచేసిన, ఖర్చుచేయబోతున్న నిధుల వివరాలు అందజేయాలని ఆదేశించారు. వచ్చే నెల 4వ తేది నాటికి పూర్తి వివరాలు అందజేయాలని, తదుపరి సమావేశంలో అందజేసిన నివేదికలపై చర్చించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో యస్.సిలకు కేటాయించాల్సినవి ఏమైనా ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే మంజూరుచేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.  

            ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్,  జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ.రత్నం, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త వై.యశోధలక్ష్మీ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.