విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా జగనన్న విద్యా దీవెన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తల్లులు ఖాతాల్లోకి జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెల్లడించారు. గురువారం విద్యా దీవెన పై వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ త్రైమాసికానికి విద్యా దీవెన తల్లులు ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 6140 మంది విద్యార్థులకు 2 కోట్ల 81 లక్షల 8342 రూపాయలని, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా 2692 మంది విద్యార్థులకు ఒక కోటి 5 లక్షల 89 వేల 103 రూపాయలని, వెనుక బడిన సంక్షేమ శాఖ ద్వారా 55864 మంది విద్యార్థులకు 26 కోట్ల 98 లక్షల 97 వేల 441 రూపాయలని, ఇబిసి ద్వారా 1902 మంది విద్యార్థులకు ఒక కోటి 4 లక్షల 74 వేల 892 రుపాయలని, మైనారిటీ సంక్షేమ శాఖా ద్వారా 145 మంది విద్యార్థులకు 6 లక్షల 34 వేల 475 రూపాయలని, కాపు సంక్షేమ శాఖ ద్వారా 991 మంది విద్యార్థులకు 68 లక్షల 34 వేల 995 రూపాయలను, క్రిస్టియన్ మైనారిటీ 15 మంది విద్యార్థులకు 81 వేల 112 రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేసినట్లు వివరించారు.
పాతపట్నం నియోజక వర్గం శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ తల్లి, తండ్రి ఎన్నో కష్టాలు పడుతూ తమ పిల్లలను చదివిస్తున్నారని, తల్లి తండ్రిలకు కష్టాలు లేకుండా తమ పిల్లలకు ప్రభుత్వమే ఫీజు చెల్లించే విధంగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన ప్రవేశపెట్టినట్లు వివరించారు. అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశమన్నారు. మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు. రాజాం నియోజక వర్గం శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ విద్యా, వైద్యరంగాలకు ముఖ్యమంత్రి పెద్ద పీఠ వేస్తున్నారని చెప్పారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ముఖ్యమంత్రి జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహాయం చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెల్లి చదువుకోవచ్చునని, అక్షరాస్యత పెరగాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ. రత్నం, గిరిజన సంక్షేమ శాఖ డిడి కమల, బిసి సంక్షేమ శాఖ డిడి కృతిక, తదితరులు పాల్గొన్నారు.