మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ డా. జి. సృజన గురువారం జివిఎంసి ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఎం.ఎ.&యు.డి. కి సంబందించిన ఆరు రకాల సచివాలయ కార్యదర్శులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఏపిహెచ్ఆర్ డి తరుపున ఆన్లైన్ లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యదర్శులందరూ ఉదయం 8.45 గంటలకు మొబైల్ ఫోన్ లోనే హాజరు అవ్వాలని, మెడికల్ లీవ్ లోనూ, మెటర్నటీ లీవ్ లో ఉన్నవారు కూడా తమ మొబైల్ ఫోన్లో నుండి క్లాసులకు హాజరు వాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఆన్లైన్ క్లాసులో పాల్గొని తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంతం 5 గంటల వరకు వారి వారి సచివాలయాలలో యధావిధిగా విధులను నిర్వహించాలని ఆదేశించారు. అందరు జోనల్ కమిషనర్లు, నోడల్ అధికారులుగా వ్యవహరించాలని, వారి దిగువ స్థాయి సిబ్బందిని ప్రోగ్రాం ఇంచార్జ్ లుగా ఏర్పాటు చేసుకుని ఈ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు.