తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పేషంట్లకు నూతన బ్లాక్ నిర్మించి రోగులకు మరింత మెరుగైన సౌర్యాలు కల్పించాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలోని చాంబర్‌లో గురువారం స్విమ్స్, టిటిడి అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ స్విమ్స్‌లో కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగిన పేషంట్లకు క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించాలన్నారు. రోగులకు వేగవంతమైన వైద్య సేవలు అందించడానికి మరింత విస్తృతంగా ఐటి సేవలు వినియోగించుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. హెచ్ఆర్ మేనేజ్మెంట్, హాస్పిటల్
మేనేజ్మెంట్ అప్లినేషన్లు రూపొందించాలని కోరారు. ఆసుపత్రిలో రేడియాలజీ ఇమేజింగ్ సిస్టమ్ (పిఏసిఎస్) ద్వారా ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ తీసుకున్న రోగుల స్కానింగ్ రిపోర్టులు సంబంధింత డాక్టర్లకు ఆన్‌లైన్‌లో పంపేవిధంగా నూతన సాప్ట్‌వేర్ రూపొందించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా స్టూడెంట్స్ సాఫ్ట్‌వేర్ రూపొందించి టిటిడి విద్యాసంస్థల్లోని విద్యార్థుల వివరాలు పొందుపర్చాలన్నారు. రోగులకు అహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు ఆసుపత్రి అవరణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ, పచ్చదనాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశ్రీ వైద్యసేవలపై ఈఓ సమీక్షించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, సిఇ నాగేశ్వరరావు, ఎఫ్ఎ అండ్ సిఎవో బాలాజి, సిఏవో రవిప్రసాదు, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, స్విమ్స్ ఐటి మేనేజర్ భావన ఈ సమీక్షలో పాల్గొన్నారు.