కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు..


Ens Balu
2
Srikakulam
2021-07-29 16:29:00

కార్పొరేట్ ఆసుపత్రిలకి ధీటుగా జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( రిమ్స్ ) పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ వైద్యులకు సూచించారు. ఇక్కడ మంచి అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే కార్పొరేట్ ఆసుపత్రికి తక్కువేమి కాదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ వైద్యులు అందించిన సేవలు అభినందనీయమని కొనియాడిన ఆయన వైద్యులు చేసేది వృత్తి కాదని, సేవగా భావించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఆరోగ్యకరంగా, సంతోషంగా వెళ్లాలని ఆ దిశగా వైద్యులు కృషిచేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మరియు సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులపై ఎక్కువ శాతం మంది ఆధారపడేలా ఆసుపత్రిని అభివృద్ధిచేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన వాటిని సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఆసుపత్రి, వైద్య కళాశాల ఉందని ఇందుకు నీటి అవసరం ఎంతైనా ఉందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు లేవని సభ్యులు తెలియజేయడం జరిగిందన్నారు. 

ఈ విషయమై నగరపాలక సంస్థ కమీషనర్ తో మాట్లాడటం జరిగిందని, ఇప్పటికే బోర్ వేసారని, పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే వేతనాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పారిశుద్ధ్యం కొంత లోపించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం వేరే సంస్థకు పారిశుద్ధ్య బాధ్యతలను అప్పగించడం వలన ఇకపై పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ లలో వైద్యులు, సిబ్బంది, వైద్య కళాశాల విద్యార్ధులు బాగా పనిచేసారని ఇదేస్పూర్తితో రానున్న థర్డ్ వేవ్ లో కూడా బాగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. దేశంలో థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయని, అందుకు తగిన విధంగా ఆసుపత్రిలో వసతులు సమకూర్చుకోవాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి మౌలిక వసతులను మరింత మెరుగుపరచుకోవలసిన అవసరం ఉందని, ఆ దిశగా వైద్యులు కృషిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తొలుత ఆసుపత్రి ప్రగతి నివేదికను ఆసుపత్రి పర్యవేక్షకులు కలెక్టర్ కు వివరించారు.

శ్రీకాకుళం పురపాలక సంఘం మాజీ ఛైర్ పర్సన్ మరియు సలహా మండలి సభ్యులు యం.వి. పద్మావతి మాట్లాడుతూ  రిమ్స్ ప్రారంభమైన నాటి నుండి అభివృద్ధి చెందుతూ వస్తుందని అన్నారు. రిమ్స్ లో ఉండే సదుపాయాలు, వసతులు గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదని, అందువలనే కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, ప్రజల్లో ఈ అపోహను తొలగించాలని కోరారు. కోవిడ్ సమయంలో ఇక్కడి వైద్యులు మంచి సేవలు అందించారని కితాబిచ్చారు. వైద్యాన్ని వృత్తిగా కాకుండా సేవగా భావించాలని, అనారోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పంపించాలని వైద్యులను కోరారు. ఈ విషయమై వైద్యులు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని, తద్వారా విశాఖలోని కె.జి.హెచ్ కు ఎంత మంచి పేరు ఉందో  రిమ్స్ కు అంత మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని, ఇంత భారీస్థాయిలో నిర్మించిన ఆసుపత్రికి సరైన నీటి సదుపాయం, పారిశుద్ధ్యం లేదని ఫిర్యాదులు తమకు వచ్చినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 600 పడకల ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల ఇక్కడ ఉందని, విద్యార్ధులు, వైద్యుల క్వార్టర్స్ ఉన్నాయని, అందుకు తగిన విధంగా నీటి సదుపాయం లేదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని నాడు – నేడు క్రింద ఆసుపత్రికి నీటి సదుపాయాన్ని కల్పిస్తే భవిష్యతులో నిరంతర నీటి సరఫరా ఉంటుందని  ఆమె కలెక్టర్ ను కోరారు.

మరో సభ్యులు వరుదు విజయకుమార్ మాట్లాడుతూ ఇక్కడ 250 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, సంఘంలోని లోపాలు వలన సక్రమంగా పనిచేయడం లేదని, వాటిని సరిచేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ విషయాన్ని సామాన్య ప్రజలకు చేరవేస్తే మరింత సార్ధకత లభిస్తుందన్నారు. అలాగే ఆసుపత్రికి వచ్చే నిధుల్లో కొంత పారదర్శకత లోపించిందని, ఇప్పటికైనా సరిచేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కె.శ్రీనివాసులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ఎ.కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ.కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, నగరపాలక సంస్థ కమీషనర్ సిహెచ్.ఓబులేసు, డి.సి.హెచ్.ఎస్ డా. బి.సూర్యారావు, ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి కార్యనిర్వాహక ఇంజినీర్ బి.ఎన్.ప్రసాద్, సలహా మండలి సభ్యులు లావేటి హేమసుందరరావు, డి.జగదీశ్వరరావు, కోరాడ లక్ష్మణమూర్తి, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.