సచివాలయాలు తనిఖీచేసిన కమిషనర్..
Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-29 16:30:20
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ డా. జి. సృజన గురువారం 6వ జోన్ 70వ వార్డు శ్రామిక నగర్, డ్రైవర్స్ కోలనీలో ఉన్న 1086417, 418, 420, 421 సచివాలయాలను సందర్శించి కార్యదర్శుల బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సచివాలయాలలో ప్రభుత్వ సేవలు వివరాల పట్టిక, సూచిక బోర్డులను, అత్యవసర సేవల ఫోన్ నెంబర్ల వివరాలను, కోవిడ్ నియంత్రణ నియమావళి పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సేవలు పౌరులకు అందాలనే ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, దానిని నిర్వీర్యం చేయరాదని, కార్యదర్శులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం స్థానికంగా నివాసం ఉండాలని తెలియజేశారు. వార్డ్ మ్యాపింగ్ లో ప్రతి ఇల్లు ట్యాగింగు చెయ్యాలని, కార్యదర్శులు సెలవు పెట్టదలచినచో, ఏమైనా మీటింగులకు వెళ్ళవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలని, కార్యదర్శులు విధులపై బయటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్ లో, డైరీలో పనియొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను సకాలంలో నమోదు చేసి పై అధికారులకు పరిష్కారం కొరకు పంపాలని, నిర్ణీతకాలంలో ఆర్జీలను పరిష్కరించని యెడల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాల కొరకు వచ్చిన అర్హులైన లబ్ధిదారులు నిరాశతో వెనక్కి వెళ్ళకూడదని, అలాగే ఆగష్టు 2వ తేది నుండి 18వ తేదీ వరకు జరిగే ఆన్ లైన్ శిక్షణా తరగతులకు విధిగా హాజరు అవ్వాలని కమిషనర్ సూచించారు.