ప్రతీ రైతు బరోసా కేంద్రం పరిధిలో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటు పూర్తి చేయాలని ఇన్ ఛార్జి కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ వ్యవసాయాధికారులకు ఆదేశించారు. గురువారం తన ఛాంబరులో పలు వ్యవసాయ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లాలో 634 వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు కావల్సివుండగా ఇప్పటి వరకు 622 బోర్డులు ఏర్పాటు అయ్యాయని, ఇంకను 12 బోర్డులు ఏర్పాటు కావల్సివుందని వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ 1, 2, 3 శుక్రవారాలలో గ్రామ, మండల, జిల్లా స్థాయి సమానేశాలు తప్పని సరిగా జరిగేలా చూడాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని, ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన శాఖల డిడిలు, ఎడిలతో పర్యవేక్షణ బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని జె.డి.కి సూచించారు. ఆర్.బి.కె.లలో అందించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నాణ్యతను తనిఖీలు చేయాలని, తనిఖీ చేసిన నివేదికను ఆర్.బి.కె.లలో ప్రదర్శించాలని సూచించారు. ప్రతీ ఆర్.బి.కె.ను బ్యాంకులకు మ్యాపింగే చేయాలన్నారు. కౌలు రైతులందరకు ఆగష్టు 15లోగా రుణాలు అందజేయాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల అక్రమ సరఫరాలను అరికట్టాలని, దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా అమ్మేవారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలన్నారు. చెక్ పోస్టుల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ఎరువులు, విత్తనాలు జిల్లా సరిహద్దులు దాటి బయటకు వెళ్లకుండా నియంత్రించేలా పోలీసు బందోబస్తు కోరాలని ఆ మేరకు జిల్లా ఎస్.పి.కు లేఖ వ్రాయాలని, ప్రతిని వ్యవసాయ కమిషనర్ కు మార్క్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ. భవానీ శంకర్, వ్యవసాయ శాఖ జెడి ఆషాదేవి, డిడిలు, ఎడిలు, ఉద్యాన వన శాఖాధికారులు పాల్గొన్నారు.