విజయనగరం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులను వేగవంతం చేయాలని జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం తదితర అంశాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, తోటపల్లి, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, తారకరామతీర్ధసాగర్, వెంగళరాయసాగర్, నాగావళి ఫ్లడ్ బ్యాంకు, కంచరగెడ్డ, అడారుగెడ్డ, కర్రిగెడ్డ తదితర ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్ కిశోర్ మాట్లాడుతూ, నిర్వాసితుల పునరావాసం పై దృష్టిపెట్టాలని, వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే పలు ప్రాజెక్టుల భూసేకరణ ఇప్పటికీ కొన్నిచోట్ల పెండింగ్‌లో ఉందని, దానిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి, న్యాయపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి, గూడెపువలస, కంచేరు, రావాడ, సవరివిల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్న భూసేకరణపై గ్రామాలవారీగా సమీక్షించారు. ఎయిర్‌పోర్టు ఎప్రోచ్ రోడ్డు, ట్రంపెట్ బ్రిడ్జి తదితర అంశాలపై ప్రశ్నించారు. విమానాశ్రయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, నిర్లిప్తతను విడనాడి, ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, హెచ్‌వి జయరామ్, టిటిపిఆర్ ఇఇ తిరుపతిరావు, తోటపల్లి ప్రాజెక్టు ఇఇ రామచంద్రరావు, కలెక్టరేట్ జి.సెక్షన్ సూపరింటిండెంట్ జి.సూర్యలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.