అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట స్వామివారి దేవస్థానానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అంత స్థాయిలో ఇక్కడ సత్యేదేవుడిని కూడా భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. పైగా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండటం, స్వామివారి ఆలయం మీదుగానే అన్ని వాహనాలు వెళ్లడం అందరికీ కలిసొచ్చే అంశం. ఎలా చూసినా స్వామివారు భక్తులకు చాలా దగ్గరగా ఉంటారు. ఇంతవరకూ బాగానే వున్నా స్వామివారికి చెందిన ముఖ్య సమాచారం దేవస్థాన అధికారులు బయటకు చెప్పడం లేదు. ఇక్కడ దేవస్థానానికి అధికారిక పీఆర్వోఓ(పత్రికా సంబంధాల అధికారి) లేకపోవడం.. ఇక్కడ పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ కి ఈ బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడంతో స్వామి సమాచారం బయటకు రావడం లేదు. వాస్తవానికి శ్రీ సత్యదేవుని ఆలయంలో విశేషమై పూజలు, ముఖ్యపర్వదినాల్లో దర్శనాలు, కార్యక్రమాలు, ఆలయ అభివ్రుద్ధి, ప్రముఖుల సందర్శన, స్వామికి వారికి చెందిన పూజలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం, అన్నింటికంటే మించి కానుకల సమర్పణ, విరాళాలు, దాతలు ఎవరైనా ముందుకి వచ్చి ఏమైనా సహాయం అందించాలన్నా ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి. దీనితో స్వామివారికి చాలా ఆదాయం చేరకుండా పోతుంది. చిన్న చిన్న దేవస్థానాలు సైతం ఆలయాల్లో ప్రత్యేకంగా పీఆర్వోలను ఏర్పాటు చేసుకొని స్వామి వైభవాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఆదాయాన్ని, దాతల నుంచి సహాయాన్ని ఆర్జిస్తున్నారు. పెద్ద పెద్ద దాతల సహాయంతో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
విచిత్రంగా అన్నవరం దేవస్థానంలో మాత్రం వీటికి విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ కొండపై బెదిరించేవారిదే రాజ్యం. అలాంటి వారికే దేవస్థాన అధికారులు కూడా సమాచారం తెలియజేస్తారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. చిన్న ఉదాహరణ తీసుకుంటే ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఒక బియ్యం వ్యాపారి కోట్ల రూపాయలు ఖర్చుచేసి పేదలకు ఉచితంగా వివాహాలు జరిపించడానికి ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ విషయాన్ని దేవస్థాన అధికారులు ఒక వర్గం మీడియాకి మాత్రమే అందించారు. సత్యదేవుని రత్నగిరి కొండపై పెళ్లిళ్లు చేసుకుంటే వారి జీవితాలు బాగుంటాయనేది ఏన్నోఏళ్లుగా ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. అలాంటి నిరుపేద ప్రజల కోసం కొండపై ఏ తరహా వసతులు ఉన్నాయో కూడా ఇక్కడ చెప్పే అధికారులు లేరు. కారణం వారికి వచ్చే సైడ్ ఇన్కం పోతుంది. అదే ప్రజలకు దేవస్థానంలోని ప్రతినిత్యం కాటేజీల వివరాలు, సదుపాయాలు, ఉచిత కళ్యాణ మండపాలు వివరాలు అన్ని మీడియా సంస్థలకుతెలియజేస్తే.. వాటిని పత్రికలు, టీవీలు, సామాజిక మాద్యమ మొబైల్ న్యూస్ యాప్ ల ద్వారా ప్రజలు తెలుసుకొని స్వామివారి సన్నిధికి రావడానికి, విశేషంగా కొండపైనే పెళ్లిల్లు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలా వస్తే దేవస్థాన అధికారులకు.. అక్కడ బ్రోకరేజీచేసేవారికి ఆదాయం ఒక్కసారిగా పడిపోతుంది.
దీనితో కొండపై ఏం జరుగుతందనేది ఎవరికీ చెప్పడం లేదు.. చెప్పినా ఒక వర్గం మీడియాకి మాత్రమే చెబుతున్నారు. వారు కూడా ఇష్టమొస్తే దానిని మీడియాకి తెలియజేస్తారు లేదంటే అదీ లేదు. దీనితో సత్యదేవుని సమాచారం భక్తులకు గానీ ప్రజలకు గాని సకాలంలో మీడియాకి ద్వారా తెలియడం లేదు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ఆదాయం పెంచుకోవడానికి, స్వామివారిని భక్తులకు చేరువ చేయడానికి ఎన్నో ప్రచార కార్యక్రమాలు అవలంభించాయి ఒక్క అన్నవరం దేవస్థానం తప్పా. ముఖ్యంగా ఆన్ లైన్ లో సేవలు, ఆన్ లైన్ విరాళాలు, ఇలా చాలా కార్యక్రమాలపై ఇక్కడి అధికారులు అస్సలు ప్రచారం చేయడం లేదు. వాస్తవానికి దేవస్థానికి చెందిన ఏ ప్రచారమైనా మీడియా సంస్థల ద్వారా ప్రభుత్వం ఉచితంగానే చేపడుతుంది. విచిత్రంగా ఆ పనికూడా ఇక్కడి అధికారులు చేయరంటే బయట ఆదాయం పోతుందనే కోణంలో ఇక్కడి అధికారులు ఏస్థాయిలో ఆలోచిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్జేసి స్థాయి అధికారి దేవస్థానానికి ఈఓగా ఉన్నా.. స్వామి సమాచారం మాత్రం బయటకు పూర్తిస్థాయిలో రావడం లేదంటే ఇక్కడి అధికారులు, యాక్టింగ్ పీఆర్వో ఏవిధంగా పనిచేస్తున్నారో.. మీడియాకి సమాచారం ఏవిధంగా అందజేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.. ఇప్పటికైన సత్యదేవుని పూర్తిసమాచారం దేవస్థాన పీఆర్వో విభాగం ద్వారా మీడియాకి తెలియజేసినా, ఉచిత, నగదు కళ్యాణ మండపాల వివరాలు అనునిత్యం తెలియజేసినా స్వామివారికి ఆదాయం రావడంతోపాటు, ఆయన పాదాల చెంతనే పెళ్లిల్లు, పూజలు చేసుకోవాలన్న భక్తుల కోరికలు నెరవేరుతాయి.