విజయనగరం జిల్లాలో వైద్యారోగ్యశాఖ సేవలను మరింత మెరుగుపర్చాలని వైద్యాధి కారులను జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై తన ఛాంబర్‌లో శుక్రవారం సాయంత్రం సమీక్షించారు. శాఖా పరంగా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. జిల్లాలో పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, బ్లడ్ బ్యాంకులు, అర్బన్ హెల్త్ సెంటర్లు ద్వారా అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ముఖ్యంగా గిరిజనులకు, మహిళలకు అందిస్తున్న వైద్య సేవలపై ప్రశ్నించారు. ఆసుపత్రుల పనితీరు, సదుపాయాలు, మందులు, వైద్యులు, సిబ్బంది లభ్యతను తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణపనులపై ప్రశ్నించారు. జిల్లాలో మలేరియా వ్యాప్తి, చికెన్ గున్యా, ఇతర సీజనల్ వ్యాధులపైనా ఆరా తీశారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. దీనికోసం స్త్రీశిశు సంక్షేమశాఖతో కలిసి పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తల మధ్య సమన్వయం ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ నియంత్రణపై చర్చించారు. టెస్టులు, కోవిడ్ ఆసుపత్రులు, పడకలు, ఆక్సీజన్ సరఫరా, వేక్సినేషన్, మందులు, సదుపాయలను తెలుసుకున్నారు. అన్నివిధాలా ఆసుపత్రులను సంసిద్దంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, డిఐఓ డాక్టర్ గోపాలకృష్ణ, కేంద్రాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సీతారామరాజు, ఎపిఎంఐడిసి ఇఇ ఎం.సత్యప్రభాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.