రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాల అమలు, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై తనకు అధికారుల నుంచి వాస్తవ సమాచారం వుండాలని స్పష్టంచేశారు. జిల్లాలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఘటన జరిగితే జిల్లా అధికారుల నుంచే తనకు ముందుగా సమాచారం అందాలని, రాష్ట్రస్థాయి నుంచి వచ్చే వరకు ఇక్కడి అధికారులు తెలియజేయకపోతే సహించేది లేదన్నారు. జిల్లా కలెక్టర్ గా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన అనంతరం మధ్యాహ్నం జిల్లా అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరయంలో కలెక్టర్ భేటీ అయ్యారు. ముందుగా జిల్లా అధికారులకు తన గురించి వివరించి, గతంలో ఎక్కడెక్కడ, ఏయే ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించిందీ వివరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులను ఒక్కొక్కరిని పరిచయం చేసుకొని ఆయా శాఖల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, పరిష్కరించాల్సిన సమస్యలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై దాదాపు మూడు గంటల పాటు సమగ్రంగా చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌గా తన ప్రాధామ్యాలను వివరించారు.
జిల్లాలో విద్యాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమం వంటి రంగాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాలో వరి అధికంగా పండిస్తున్నందున రైస్ బ్రాన్ ఆయిల్ తయారీ వంటి ఆహారశుద్ది పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాకు కొత్త రైస్‌మిల్లు యజమానులను రప్పించాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ సకాలంలో జరగడం లేదని ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని సరిచేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్ కుమార్, మయూర్ అశోక్, జె.వెంకటరావు, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా అధికారులంతా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమారిని పుష్పగుచ్ఛాలకు బదులు నోటు పుస్తకాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నోటు పుస్తకాలను గిరిజన విద్యార్దులకు అందజేసి వారికి ఉపయోగపడేలా చూస్తామని కలెక్టర్ చెప్పారు.