విజయనగరం జిల్లాలో ఆహార హక్కు చట్టం చక్కగా అమలు జరుగుతోందని కేంద్ర బృందం ప్రశంసించింది. మొత్తం 12 జిల్లాల్లో, విజయనగరం జిల్లా మెరుగ్గా ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 అమలు తీరును వివిధ జిల్లాల్లో పరిశీలించేందుకు కేంద్రప్రభుత్వం జైపూర్‌కు చెందిన సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ స్టడీస్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ ప్రతినిధులు గిరిజాశంకర్, ఎం.రవిప్రతీక్, నాగేశ్వర్ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించారు. పిడిఎస్ బియ్యం సరఫరా, మహిళాభివృద్ది, శిశుసంక్షేమశాఖ కార్యకలాపాలు, అంత్యోదయ అన్నయోజన బియ్యం పంపిణీ, బియ్యం, ఇతర నిత్యావసరాలు నిల్వ ఉంచేందుకు గోదాముల సదుపాయం, మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేంద్ర బృందం శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్‌తో సమావేశమయ్యింది. పేదలకు ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సందర్భంగా జెసి వివరించారు. పేదలందరికీ ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా నిరాఘాటంగా బియ్యం పంపిణీ చేసినందుకు బృందం సభ్యులు జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరా అధికారి ఏ.పాపారావు, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, సివిల్ సప్లయిస్ డిఎం దేవుల్ నాయక్, ఏఎం మీనా, మార్కెటింగ్ ఏడి వైవి శ్యామ్‌కుమార్, డ్వామా, ఎడ్యుకేషన్, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖల అధికారులు, డిసిఐసి సభ్యులు చదలవాడ ప్రసాద్, వివిధ వినియోగదారుల సంఘాలు, సంస్థల ప్రతినిధులు సుబ్బారావు, హెచ్ఎస్ రామకృష్ణ, కె.వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.