నూతన ఉద్యోగులు పనినే దైవంగా భావించాలని, శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో భగవంతుని చూసి అంకితభావంతో సేవలందించాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. టిటిడిలో ఒకేసారి కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులకు తిరుపతి శ్వేత భవనంలో 15 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈఓ, జెఈఓ శ్రీమతి సదా భార్గవితో కలిసి 119 మంది ఉద్యోగులకు పోస్టింగులు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, నిబద్ధత, చిత్తశుద్ధితో పని చేసి టిటిడికి మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వ జిఓలు, టిటిడి చట్టాలు, సర్వీస్ నిబంధనలపై పట్టు పెంచుకుని మెరుగ్గా కార్యాలయ విధులు నిర్వహించాలని సూచించారు. అర్హత గల ఉద్యోగులు పలు పోటీ పరీక్షలు కూడా రాసి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తన ఐఏఎస్ శిక్షణ కాలంలో నేర్చుకున్న విషయాలు అనంతరం ఉద్యోగ సమయంలో ఎలా ఉపయోగపడ్డాయనే విషయాలు, సొంత అనుభవాలను ఈ సందర్భంగా ఈఓ తెలియజేశారు. జెఈఓ సదా భార్గవి మాట్లాడుతూ ఈ ఉద్యోగాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి ఇచ్చిన అరుదైన అవకాశంగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా విధులు నిర్వహించి టిటిడి ప్రతిష్టను కాపాడాలన్నారు. నూతన ఉద్యోగులందరూ శ్వేత భవనంలో మొక్కలు నాటారని, వీటిని సంరక్షించాల్సిన బాధ్యత వారే తీసుకోవాలని సూచించారు. టిటిడి ముఖ్య అంకణీయ అధికారి శేషశైలేంద్ర మాట్లాడుతూ టిటిడిలో ఉద్యోగం పూర్వజన్మ సుకృతమని, నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు సేవాభావంతో విధులు నిర్వహించాలని కోరారు. శ్వేత డైరెక్టర్ డాక్టర్ రామాంజులరెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో(హెచ్ఆర్) గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు.