రైతులు ఇ –క్రాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. లావేరు మండలం తాళ్ళవలస, జి.సిగడాం మండలం సంతవురిటి తదితర గ్రామాల్లో ఇ క్రాప్ బుకింగ్, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పనితీరును కలెక్టర్ శుక్ర వారం తనిఖీ చేసారు. రైతులు ఇ క్రాప్ లో నమోదు కావడం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలు, బీమా, నష్టపరిహారం తదితర కార్యక్రమాలు పొందుటకు ఇ క్రాప్ అవసరమని ఆయన చెప్పారు. ఇ క్రాప్ లో నమోదు కావడం వలన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు పాలన చేరువ చేయుటకు గ్రామ స్ధాయిలో వ్యవస్ధను ఏర్పాటు చేసిందని వాటి ఫలితాలు ప్రజలకు అందాలని ఆయన అన్నారు. గ్రామ స్ధాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు తమ సమస్యలను గ్రామ సచివాలయంలోనే నమోదు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. సచివాలయాల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రజలు సచివాలయంలోకి ప్రవేశించగానే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం వివరాలు తెలియాలని, సామాజిక ఆడిట్ కు వచ్చిన లబ్దిదారుల జాబితా ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు. సచివాలయాలకు బియ్యం కార్డు, పింఛను, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ కోసం అధికంగా దరఖాస్తులు వస్తాయని పేర్కొంటూ వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ధేశిత సమయంలో ఆర్జీలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేసారు.
సచివాలయాల్లో యువత ఉద్యోగులుగా ఉన్నారని అదే వేగంతో సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. విధులను చక్కగా నిర్వహించడం వలన ప్రజల హృదయాల్లో నిలుస్తారని ఆయన సూచించారు. రైతు భరోసా కేంద్రంలో ధృవీకరణ విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు. అందుకు తగిన విధంగా వ్యవసాయ సహాయకులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో అన్ని సూచనలు సలహాలు అందించాలని కలెక్టర్ అన్నారు. విత్తనం నుండి విక్రయం వరకు అవసరమగు అన్ని మార్గదర్శకాలు రైతులకు అందించడం రైతు భరోసా కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశ్యాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులకు మంచి విత్తనాలు అందడం వలన అధిక దిగుబడులు సాధించగలరని అన్నారు. గిట్టుబాటు ధర వచ్చే విధంగా అన్ని మార్కెటింగు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన కియాస్కోల సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సచివాలయ, రైతు భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.