శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నియోజక వర్గ స్థాయిలో సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త ( డిసిహెచ్ఎస్ ) డా. బి.సూర్యారావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. గతంలో నిర్వహిస్తున్న షెడ్యూలులో మార్పులు చేయడం జరిగిందని, ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి నందు మంగళ, శుక్రవారాల్లో సదరం క్యాంపులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస సి.హెచ్.సి నందు శుక్రవారం, ఎచ్చెర్ల నియోజక వర్గానికి రణస్థలం సి.హెచ్.సి నందు బుధవారం సదరం క్యాంపులను నిర్వహిస్తారని తెలిపారు. నరసన్నపేట నియోజకవర్గంలో నరసన్నపేట ఏరియా ఆసుపత్రి నందు శుక్రవారం, టెక్కలి నియోజకవర్గంలో జిల్లా ఆసుపత్రి, టెక్కలి నందు మంగళ, శుక్రవారాల్లో సదరం క్యాంపులు నిర్వహించబడతాయని ఆయన చెప్పారు. పలాస నియోజకవర్గంకు సంబంధించి పలాసలోని సి.హెచ్.సి నందు బుధవారం, ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం సి.హెచ్.సి నందు మంగళవారం, పాతపట్నం నియోజకవర్గంలోని పాతపట్నం సి.హెచ్.సి నందు మంగళవారం నాడు సదరం క్యాంపులను నిర్వహిస్తారని తెలిపారు. రాజాం నియోజకవర్గ పరిధిలో రాజాం ఏరియా ఆసుపత్రి నందు మంగళ, శుక్రవారాల్లోనూ , పాలకొండ నియోజకవర్గ పరిధిలోని పాలకొండ ఏరియా ఆసుపత్రి నందు మంగళ, శుక్రవారాల్లో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు వివరించారు. సదరం క్యాంపులు పై తెలిపిన రోజుల్లో ఆయా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12.30గం.లకు ప్రారంభమై అదేరోజున జారీచేయడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.