రక్తదానం ఒక గొప్ప కార్యక్రమమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణందాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో గల వై.టి.సి. కేంద్రం వద్ద రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దానం శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం దానం చేయడమనేది ఒక గొప్ప కార్యక్రమని, జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ లలో కూడా సుమారు వేయి మంది రక్త దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ముందుకు రావాలని, రెవెన్యూ సిబ్బంది అందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడల శాఖ నుండి రక్త దానం శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. తాను చాలా సార్లు రక్తం దానం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ కోవిడ్ ఉన్నందు వలన కళాశాలలకు సెలవు దినాలు అయినందున యువత అందుబాటులో లేరని, అలాంటి సమయంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ముందుకు వచ్చి రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడమనేది ఒక గొప్ప కార్యక్రమమన్నారు. రక్త దానం ఒక ఉద్యమంలా మరింత మంది ముందుకు వచ్చి రక్తం దానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నా రక్తం ఎ పాజివ్ అని, ఇక ముందు నేను రక్త దానం చేస్తానని చెప్పారు. ఎవరికైనా అత్యసరం అనిపిస్తే రక్తం దానం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, ఐటిడిఎ పిఓ సిహెచ్ శ్రీధర్, ఆర్డిఓ ఐ. కిషోర్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి. జగన్మోహన్ రావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి. సుందరరావు, జిల్లా చీఫ్ కోచ్ బి. శ్రీనివాస్ కుమార్, రెడ్ క్రాస్ కార్యదర్శి బి. మల్లేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కాళీ ప్రసాద్, కార్యదర్శి పి. వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ఎస్. సతీష్, డివిజనల్ కార్యదర్శి ధర్మాన ప్రకాసరావు, తహసిల్థర్లు వెంకటరావు, సుధాసాగర్, దిలీప్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.