శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక అవకాశాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పర్యాటక అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యాటక అథారిటీ సమావేశం శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అపారమైన పర్యాటక వనరులు ఉన్నాయన్నారు. జిల్లాలో నదులు, ఆలయాలు, ప్రకృతి అందించిన పచ్చదనం, దగ్గర లో పట్టణాలు ఉన్నాయని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పర్యాటక ఆకర్షణకు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుత పర్యాటక పరిస్థితి, పర్యాటక పరంగా వస్తున్న ఆదాయం స్థితిగతులకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వాటి అంచనాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యాటక ప్రదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశమని ఆ మేరకు పర్యాటక ప్రదేశాల్లో ఉపాధి పొందుతున్న వారి వివరాలను సేకరించాలని ఆయన అన్నారు. పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్న దృష్ట్యా పర్యాటక శాఖ, పర్యాటక సంస్థ వ్యాపార దృక్పథంలో ఆలోచించి పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. జిల్లాలో ప్రస్తుతం పర్యాటక కేంద్రాలు ఉన్న ప్రదేశంతో పాటు ఇంకా అవకాశాలు ఉన్న ప్రదేశాలను కూడా గుర్తించి వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించాలని ఆయన ఆదేశించారు. పక్కా ప్రణాళికలతో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయుటకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
పర్యాటక సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే.రమణ మాట్లాడుతూ జగతిపల్లి రిసార్ట్స్, శివ సాగర్ బీచ్ అభివృద్ధి చేయుటకు చేపట్టామని అయితే చెల్లింపులు పెండింగ్ కారణంగా గుత్తేదారులు పనులను ఇంకా పూర్తి చేయలేదని వివరించారు. శాలిహుండం బౌద్ద సర్క్యూట్ అభివృద్ధి, సీతంపేట లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నామని, సీతంపేట ట్రైబల్ మ్యూజియం నిర్మాణాన్ని స్థానిక పర్యాటక నిధులతో చేపట్టామని ఆయన వివరించారు. స్కూబా డైవింగ్ ఏర్పాటుకు, రిసార్ట్స్ ఏర్పాటుకు అవసరమగు స్థలాల్ని కేటాయించుటకు ప్రతిపాదనలు సమర్పించామని, మడ్డువలస ప్రాజెక్టు వద్ద రిసార్ట్స్ ఏర్పాటు, బోటింగ్ చేయుటకు మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా జలవనరుల శాఖకు ప్రతిపాదనలు సమర్పించామని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సిహెచ్. శ్రీధర్, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ, ఆర్కియాలజీ ప్రతినిధి కే.నరసింహ నాయుడు , సెట్ శ్రీ సీఈఓ కె.ఎస్. ప్రభాకర్ రావు, హోటల్స్ సంఘం ప్రతనిధులు ఎస్.వి.సతీష్, మెట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.