మెట్ట, డెల్టా, అటవీ, తీరప్రాంతాలతో భౌగోళిక వైవిధ్యమున్న అందమైన తూర్పుగోదావరి జిల్లాకు కలెక్టర్‌గా రావడం ఎంతో సంతోషంగా ఉందని.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు కృషిచేయనున్నట్లు కలెక్టర్ చేవూరి హరికిరణ్ అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్న హరికిరణ్ శనివారం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం పరిధిలో కారుణ్య నియామకానికి సంబంధించిన ఓ దస్త్రంపై తొలి సంతకం చేశారు. జేసీ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (హౌసింగ్) ఎ.భార్గవ్‌తేజ, ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డబ్ల్యూ), డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు కొత్త కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్పందన హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సవాళ్లను ఎదుర్కొంటూ ఎస్‌సీ, ఎస్‌టీలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలుచేస్తున్న కార్యక్రమాలను లబ్ధిదారులకు చేరువ చేసేందుకు కృషిచేయనున్నట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లాకు కలెక్టర్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, సచివాలయ వ్యవస్థ సేవలు తదితర కార్యక్రమాలను సమర్థవంతంంగా అమలుచేస్తూ జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలో అనుభవజ్ఞులైన అధికారుల బృందం ఉందని, ఐఏఎస్‌లు ఉన్నారని.. రెవెన్యూ, పోలీస్ తదితర అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేస్తామన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.. ఇలా అందరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ మీడియా వారధిగా అందరి సహకారంతో ప్రజా సంక్షేమం లక్ష్యంగా విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2011లో భద్రాచలంలో సబ్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ప్రస్తుతం జిల్లాలోని విలీన మండలాలపై అవగాహన ఉందన్నారు. బాల్య జీవితంలోని కొంత సమయం జిల్లాతో ముడిపడి ఉందని.. ఇలాంటి జిల్లాకు కలెక్టర్‌గా రావడం అదృష్టమని పేర్కొన్నారు. అందమైన తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక విధానానికి అనుగుణంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వైరస్ కట్టడికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కీలకమైన కాకినాడ జీజీహెచ్ అభివృద్ధికి కృషిచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
మీడియా సమావేశం అనంతరం జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో కలిసి కలెక్టర్ చేవూరి హరికిరణ్ కలెక్టరేట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం కమిషనర్ అభిషిక్త్ కిషోర్, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ; రాజమహేంద్రవరం, రంపచోడవరం సబ్ కలెక్టర్లు ఇలాక్కియా, కట్టా సింహాచలం; రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సీవీ ప్రవీణ్ ఆదిత్య, వెంకట రమణ; కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, రామచంద్రాపురం ఆర్‌డీవో సింధు సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.