మంచి ప్రణాళికలు పటిష్టంగా అమలు చేసి లక్ష్య సాధనలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వివిధ శాఖల జిల్లా అధికారులను కోరారు. శనివారం మద్యాహ్నం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించి జిల్లా స్థాయిలో ఆయా శాఖల పరమైన వ్యవస్థలను, వాటి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది పనితీరు, సమర్థతకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉందని, దానికి తగిన రీతిలో అందరూ దక్షతతో పనిచేసి అన్ని అంశాలలో జిల్లాను ముందు నిలపాలని కోరారు. జిల్లా అధికారులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాని, శాఖల పరమైన అత్యవసరమైన ఏ విషయానైనా నేరుగా తనతో మాట్లాడ వచ్చునని తెలియజేశారు. ఏ కారణం చేతైనా తాను ఫోన్ కు అందుకోలేక పోతో వాట్సాప్ సందేశం ద్వారా సమాచారం తెలియజేయాలని. సాధారణ ఫైళ్లను తప్పని సరిగా తమ తమ శాఖలను పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ ద్వారా తనకు పంపాలన్నారు. పనులు, ఫైళ్లను చివరి నిమిషం దాకా నాన్చవద్దని, ప్రతి అంశాన్ని ముందస్తు సంసిద్దతో ప్రణాళికాబద్దంగా నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యంగా కోర్టు కేసుల అంశంలో సకాలం కౌంటర్లు దాఖలు చేయాలని, కౌంటర్లు దాఖలు చేయని కారణంగా కంటెంప్ట్ అఫ్ కోర్టు ఎదురైతే అందుకు సదరు శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన తెలిపారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను విజయవంతం చేయాలని, వారికి తగిన ప్రొటోకాల్ మర్యాదలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. జిల్లా అగ్ర స్థానంలో నిలిచిన అంశాలలో సంబంధిత శాఖల అధికారులను అభినందిస్తూ అన్ని శాఖలు ఇదే స్పూర్తితో పని చేయాలని ఆయన ఆధికారులను కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) డా.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (హెచ్) ఎ.భార్గవ్ తేజ, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.