ఆగష్టు 5న నిర్వహించనున్న జగన్న పచ్చతోరణం కార్యక్రమం క్రింద జిల్లాలో కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో జరపాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వన మహాత్సవంపై సమావేశం నిర్వహించారు. ఆగష్టు 5న దాసన్నపేట హైస్కూలులో ప్రారంబోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ముందుగానే గోతులు తవ్వి ఆప్రాంతాన్ని సిద్దంగా వుంచాలని ఆదేశించారు. జగన్న పచ్చతోరణంలో భాగంగా జగన్న కాలనీలలో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, గ్రామ సచివాలయాలలో,రైతు బరోసా కేంద్రాలలో, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలకు అవసరమగు గోతులను ముందుగా తవ్వి సిద్దం చేసుకోవాలన్నారు. వీలువున్నంతవరకు పండ్ల మొక్కలకు ప్రాధాన్యత యివ్వాలన్నారు. నాటిన ప్రతీ మొక్క బ్రతికేలా నీటి వనరులను, ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీల్లో, ఇళ్ల ముందు, వీధిలలో, ఖాళీగా వున్న ప్రతీ చోట మొక్కలను నాటాలన్నారు. విద్యా శాఖ, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, డ్వామా, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మార్కెటింగ్, హౌసింగ్, పరిశ్రమలు, పేపరు మిల్లులు, మున్సిపల్ తదితర శాఖలకు లక్ష్యాలను నిర్ణయించారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, డిఆర్ఓ గణపతిరావు, జిల్లా అటవీ అధికారి సచిన్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ జె.ఎస్.వర్మ, పంచాయితీరాజ్ ఇఇ విజయ్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి, నేషనల్ హైవే ప్రోజెక్టు డైరెక్టు, అటవీ శాఖ రేంజర్లు తదితరులు పాల్గొన్నారు.