కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అందుబాటులో ఉన్న డోసులు ఆధారంగా సచివాలయాల వారీగా లబ్ధిదారులను గుర్తించి టీకా పంపిణీ చేయాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్.. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వైరస్ వ్యాప్తి పరిస్థితి, వైరస్ కట్టడి కార్యాచరణ, ఆసుపత్రుల్లో వసతుల కల్పన పరంగా లోపాలను సవరించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్, మూడో వేవ్ సన్నద్ధతపై సమీక్షించారు. తొలుత జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి.. గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో నమోదవుతున్న కేసులు; డివిజన్ల వారీగా పాజిటివిటీ ట్రెండ్, కోవిడ్ కేసుల మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్ ప్రక్రియ, మూడో వేవ్ సన్నద్ధత కార్యాచరణ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా గత నెల 26న జిల్లా వ్యాప్తంగా చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా ఒక్కరోజులోనే 1,91,850 డోసులను పంపిణీ చేసినట్లు వివరించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న సమయంలో రోజుకు పదివేల వరకు పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం రోజుకు ఆరువేల వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మూడో వేవ్ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్ పడకలను ఏర్పాటు చేస్తుండటంతో పాటు పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు అమలాపురం, రాజమహేంద్రవరంలోనూ వసతుల కల్పనకు ప్రణాళికను అమలుచేస్తున్నట్లు జేసీ (డీ) వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ టీకా డోసుల లభ్యతనుబట్టి వీలైనంత త్వరగా 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని.. రెండుమూడురోజుల్లో 90 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. తొలుత రెండోడోసు లబ్ధిదారులకు ప్రాధాన్యమివ్వాలని, అనంతరం మొదటి డోసు పంపిణీ చేయాలన్నారు. జనాభాకు అనుగుణంగా పీహెచ్‌సీల వారీగా టెస్టింగ్‌కు సంబంధించి శాంపిల్ సేకరణ లక్ష్యాలను నిర్దేశించి, వాటిని చేరుకునేలా ప్రోగ్రామింగ్ అధికారులు చూడాలని స్పష్టం చేశారు. లక్ష్యాలను చేరుకున్న, చేరుకోని పీహెచ్‌సీల నివేదికలను (exception report) ఎప్పటికప్పుడు పంపాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ ప్రక్రియను అంతా ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాజిటివ్ కేసుల కంటైన్‌మెంట్ విషయంపై దృష్టిసారించాలని.. ప్రస్తుతం పాజిటివిటీని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు, నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘన జరక్కూడదని స్పష్టం చేశారు. ఇందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.
మూడో వేవ్ సన్నద్ధతలో భాగంగా ఆసుపత్రుల్లో ఏర్పాటుచేస్తున్న ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలను ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని, ప్రతి పడక వద్ద ప్రెజర్ అబ్జర్వేషన్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న దాదాపు 1400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పనితీరును పరిశీలించి, ఏవైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయాలన్నారు. ఆక్సిజన్ పీఎస్ఏ ప్లాంట్లు, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకుల సమర్థ నిర్వహణకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. కోవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా ట్రాన్సిట్ ఆసుపత్రుల ఏర్పాటుపై పరిశీలన చేయాలన్నారు. ప్రధానంగా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు తదితర ప్రాంతాల నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించి వీసా వ్యాలిడిటీ ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి, ఇన్‌చార్జ్ డీఎస్‌వో డా. నాగభూషణం, డీసీహెచ్ఎస్ డా. రమేష్ కిశోర్, కాకినాడ ల్యాబ్ ఉన్నతాధికారి డా. మూర్తి, డీఐవో డా. భరతలక్ష్మి తదితరులు హాజరయ్యారు.